Breaking News

శ్రీకాకుళంలో క్రీడల పునరుజ్జీవనానికి ముందడుగు వేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కరణం మల్లీశ్వరి

-శ్రీకాకుళంలో ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ స్థాపించాలని కోరిన రామ్మోహన్ నాయుడు, అంగీకరించిన కరణం మల్లీశ్వరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒలింపిక్ పతక విజేత, దిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉప కులపతి కరణం మల్లీశ్వరితో, ఈ రోజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో క్రీడల పునరుద్ధరణ గురించి, వెయిట్ లిఫ్టింగ్‌పై ప్రత్యేక అంశంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది.

శ్రీకాకుళంలో ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని నెలకొల్పాలని మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా కరణం మల్లీశ్వరిని కోరారు. అకాడమీ స్థాపనకు అవసరమైన భూమి, నిధులు, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో అందిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి అభ్యర్థనను కరణం మల్లీశ్వరి అంగీకరించారు. తన స్వస్థలంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తానని మాట ఇచ్చారు. “కరణం మల్లీశ్వరి విజయాలు భారతదేశ మహిళలకు స్ఫూర్తినిచ్చాయి. శ్రీకాకుళం జిల్లా బిడ్డగా మా గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. కలలు నిజమవుతాయని ఆమె ఒలింపిక్ విజయం నిరూపించింది. ఆమె వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా, వారిని శక్తిమంతం చేసేలా చూసుకోవడం మన బాధ్యత” అని మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

ఇంకా, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై సలహా ఇవ్వాలని దిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఉప కులపతి హోదాలో ఉన్న మల్లీశ్వరిని రామ్మోహన్‌ నాయుడు అభ్యర్థించారు. రాష్ట్రంలో గొప్ప క్రీడా సంస్కృతిని నిర్మించడంలో ఆమె నైపుణ్యం, మార్గదర్శకత్వం అమూల్యమైనవని అన్నారు. భవిష్యత్ విజేతలను తయారు చేయడంతో పాటు శ్రీకాకుళంలో & వెలుపల క్రీడల వ్యాప్తిని పెంచేందుకు అన్ని విధాలా సహకరించుకోవాలనే నిర్ణయంతో ఈ సమావేశం ముగిసింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *