Breaking News

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలి

-రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు,శాసన సభాపతి సూచన.
-ప్రభుత్వానికి,ఉభయ సభలకు మధ్య పూర్తి సమన్వయ ఉండేలా అధికారులు చూడాలి,సభల్లో ప్రతి ఒక్క సభ్యునికి గౌరవం దక్కాలి
-శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు
-అధికారులు సంపూర్ణమైన సమాచారం నిర్ధిష్ట సమయంలోపు మంత్రులకు అందజేయాలి.
శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
-ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ,సభా సాంప్రదాయాలు పాటిస్తూ, సభా గౌరవం నిలబెట్టేలా సమావేశాలు నిర్వహించాలి
-రాష్ట్ర ఆర్ధిక,శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అన్ని శాఖల కార్యదర్శులతో శాసన సభ సమావేశ మందిరంలో శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు,శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు,ఆర్ధిక,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరించేది ప్రభుత్వ అధికారులేనని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే అధికారుల పాత్ర కీలకమని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అన్నారు.సభలో ప్రజా ప్రతినిధులు చర్చించి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరిగినట్టే అని భావించి తదను గుణంగా హామీలు కార్యరూపం దాల్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ప్రభుత్వం పారదర్శకమైన పాలన ప్రజలకు అందించినట్లు అవుతుందని మండలి చైర్మన్ పేర్కొన్నారు.సభలో ప్రతి ఒక్క సభ్యునికి గౌరవం దక్కాలని అన్నారు.

శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన అధికారు లందరినీ ఈ సమావేశం సందర్భంగా కలవడం తనకు సంతోషంగా ఉంది అన్నారు.శాసన సభ సమావేశాలు ఏవో జరిగాయి అంటే జరిగినట్టు కాకుండా సభలోని ప్రతి మాట,చర్చ సభ్యులకే పరిమితం కాదని ప్రజలను దృష్టిలో ఉంచుకుని సభ నిర్వహణకు సహకరించాలని సభ్యులను కోరుతున్నట్టు చెప్పారు. చర్చ సజావుగా జరగాలంటే సంబంధిత శాఖల అధికారుల పాత్ర అత్యంత కీలకమని గ్రహించాలన్నారు.నిర్ధిష్ట గడువులోపు సభలో చర్చకు వచ్చే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సకాలంలో మంత్రులకు అందజేయాలని ఆదేశించారు. అవసరమైతే ఒకరోజు ముందుగానే అధికారులు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచించారు.సభలో మంత్రులు ఇచ్చే సమాధానాలు సభ్యులతో పాటు అవి ప్రజలకు కూడా చేరుతాయని గ్రహించాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సమన్వయ కర్తగా ఒక నోడల్ అధికారిని కూడా నియమించి అధికారులకు, మంత్రులకు సహకరించేందుకు కృషి చేయాలని స్పీకర్ కోరారు.

రాష్ట్ర ఆర్ధిక మరియు శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తరువాత తొలిసారి సభను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలకు జవాబుదారీ తనంతో అర్ధవంతమైన చర్చలతో ప్రజలకు మేలు జరిగేలా ఉభయ సభల నిర్వహణకు కృషి చేయాలని ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. సమావేశాలు ముగిసే వరకు అధికారులు సంబంధిత శాఖల మంత్రులకు అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నామని తెలియజేశారు.

ఈ సమావేశంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఎం. విజయారాజు తదితరలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *