Breaking News

కోర్టు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కోర్టు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో కౌంటర్ ఫైళ్ళు , అప్పీలు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి కోర్టు కేసులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఆ వారంలో ఉన్న కోర్టు కేసుల గురించి చర్చించడం జరుగుతుందని, ఏదైనా కోర్టు ఉత్తర్వులు ఉంటే అమలు చేయాలని, లేదా కౌంటర్లు గాని, అప్పీళ్లు దాఖలు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు.

ఈ వారంలో 23 కేసులు ఉన్నాయని అందులో ప్రధానంగా రెవెన్యూ, జలవనుల శాఖ, పౌరసరఫరాల సంస్థ, డిపిఓ అటవీ తదితర శాఖలు ఉన్నాయన్నారు. జిల్లా అధికారులు, వారి సిబ్బంది వలన తప్పిదం జరిగితే ఎట్టి పరిస్థితులలోను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కోర్టు కేసుకు సంబంధించి ప్రాథమిక దశలోనే ప్రభుత్వ ఉత్తర్వులు గాని, సూచనలు గాని కోర్టుకు అందజేసిన యెడల కోర్టు వారు ఆ కేసును అనుమతించరన్నారు. మద్యంతర ఉత్తర్వులు వచ్చిన యెడల వాటిని అమలు చేసి పక్కాగా రికార్డు చేసుకోవాలన్నారు. చివరి ఉత్తర్వులు వచ్చాక దానిని అమలు చేయడం గాని లేదా అప్పిలుకు పోవాల్సి వస్తే సకాలంలో అప్పీలు వేయాలన్నారు. కోర్టు ధిక్కరణ ఎట్టి పరిస్థితుల్లోనూ కాకూడదని స్పష్టం చేశారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి 16 కేసులు ఉన్నాయని వాటిని సకాలంలో అమలు చేయాలన్నారు. వచ్చే సమావేశానికి శాఖల వారీగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు జాబితా సిద్ధం చేయాలన్నారు. తాను కోర్టుకు హాజరయ్యే పరిస్థితి తీసుకుని రావద్దని హెచ్చరించారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంబంధిత జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఆర్డీవో ఎం వాణి, జడ్పీ సీఈవో ఆనంద కుమార్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీత బాయి, డ్వామా పీడీ జివి సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యు ఎస్ శ్రీనివాసరావు, శివప్రసాద్, సర్వే భూ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *