Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో 2024-25 విద్యా సంవత్సరపు ప్రవేశాలకు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలలలో ప్రవేశాలకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన డిగ్రీ విద్యనందించే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు డిగ్రీ విద్యనభ్యసించగోరు విద్యార్థులకు సకల సౌకర్యాలు కలుగజేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యాశాఖ సారధ్యంలో మొత్తం 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పనిచేస్తుండగా, వీటిలో 24 కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉన్నాయి, ప్రత్యేకించి విద్యార్థినుల నిమిత్తం 23 మహిళా డిగ్రీ కళాశాలలు వసతి గృహ సదుపాయంతో అందుబాటులో ఉన్నాయి. 106 కళాశాలలు న్యాక్ అక్రెడిటేషన్ ను పొందియుండగా మరిన్ని కళాశాలలు అక్రెడిటేషన్ కు సంసిద్ధమౌతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF), యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC), డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (DBT), రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్ (RUSA) వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటుగా రాష్ట్రప్రభుత్వం అందించే ప్రత్యేక నిధుల సహకారంతో డిజిటల్ – వర్చువల్ తరగతి గదులు, అధునాతన ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్ లు, విశాలమైన క్రీడా మైదానాలు, బొటానికల్ గార్డెన్స్, మెడిసినల్ గార్డెన్స్, అత్యాధునిక జిమ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అధునాతన విద్యాధామాలుగా విలసిల్లుతున్నాయి.
2020 నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో సింగిల్ మేజర్ విధానం ద్వారా సంప్రదాయ కోర్సులైన చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్రం, తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, వాణిజ్య – భౌతిక-రసాయన- గణిత – జంతు – వృక్ష శాస్త్రాలతో పాటుగా, స్కిల్ సెక్టార్ కౌన్సిల్స్ వంటి జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని టూరిజం హాస్పిటాలిటీ – పెట్రో కెమికల్స్ – డేటా సైన్స్ – ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – బిబిఎ హెల్త్ మేనేజ్ మెంట్ – డిజిటల్ మార్కెటింగ్ – ఫినాన్షియల్ మేనేజ్మెంట్ – రిటైల్ ఆపరేషన్స్ – లాజిస్టిక్ మేనేజ్మెంట్ – ఈవెంట్ మేనేజ్మెంట్ – బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ & ఇన్సూరెన్స్ – న్యూట్రిషన్ డెయిటిక్స్ – ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక, ఉపాధి, శిక్షణా నిబిడీకృత కోర్సులను సైతం తక్కువ ఫీజులతో అందుబాటులో ఉంచడమైనది.
2024-25 విద్యా సంవత్సరం నందు ఆర్ట్స్ విభాగం క్రింద 25, కామర్స్ విభాగంలో 20, సైన్స్ విభాగం క్రింద 35, వొకేషనల్ విభాగం క్రింద 4 కోర్సులు అందించబడుతున్నాయి. భవిష్యత్తుపై భరోసా కల్పించే దిశగా చదువుతో పాటు సమాంతరంగా ఉపాధి శిక్షణ ఆపై విద్యానంతరం ఉపాధి కల్పనకై పలు స్థానిక రాష్ట్ర పారిశ్రామిక సంస్థలతోపాటు స్కిల్ సెక్టార్ కౌన్సిల్స్ వంటి జాతీయ సంస్థలతోను, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుని ఆ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించుటకు కళాశాల స్థాయి నుండి కమీషనరేట్ స్థాయి వరకు భిన్న దశలలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడమైనది. విద్యార్థులలో సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పెంపొందించుటకు గాను విద్యలో అంతర్భాగమైన కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. నిరంతరాయమైన సాంకేతిక స్రవంతిలో కాలానుగుణంగా వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానానికనుగుణంగా ఆయారంగాలలో నిష్ణాతుల ద్వారా అధ్యాపకబృందానికి, ప్రిన్సిపల్స్ కు NEIPA, EFLU, JNU, UOH, UNICEF వంటి జాతీయ అంతర్జాతీయ శిక్షణా సంస్థల ద్వారా తర్ఫీదునిస్తూ నేటి విద్యార్థితరానికి బోధించే రీతిలో బోధనా సిబ్బందిని, బోధనోపకరణాలను నవీకరించడమైనది. విద్యాభ్యాస కాలంలో ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించే దిశగా కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ప్రభుత్వేతర సంస్థలు, దాతల సౌజన్యంతో వివిధ రకాలైన ఉపకారవేతన సదుపాయాలు విద్యార్థులకు అందించడమైనది. నూతన వ్యవస్థాపనలను ప్రోత్సహించే దిశగా “earn while learn” వంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ఆర్థిక నిర్వహణలో మెళకువలు బోధించడం జరుగుతోంది. ఉన్నత విద్యనభ్యసించగోరే విద్యార్థులకు పి. జి ప్రవేశ పరీక్షలకు శిక్షణనివ్వడం జరుగుతున్నది. 2024 పి. జి. ప్రవేశ పరీక్ష నందు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 1673 మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జేకేసి – నైపుణ్య శిక్షణా సంస్థల ద్వారా ప్రభుత్వ ఉద్యోగార్థులకు పోటీపరీక్షల నిమిత్తమై నిరంత శిక్షణ నివ్వబడుతోంది. తద్వారా గత విద్యాసంవత్సరం నందు కళాశాల విద్యాశాఖ తరఫున నిర్వహింపబడిన 93 జాబ్ డ్రైవ్స్ ద్వారా 10132 విద్యార్థులు ఆయా సంస్థలలో ఉద్యోగాలు పొందారు. ఎన్ సిసి., ఎన్ ఎస్ ఎస్., స్కౌట్స్ & గైడ్స్ యూనిట్స్ ద్వారా విద్యార్థులలో పోరాట పటిమను, సామాజిక స్పృహను, దేశభక్తిని పెంపొందించడం జరుగుతోంది. జాతీయ గణతంత్ర వేడుకలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 8 మంది క్యాడెట్లు, రాష్ట్ర ప్రభుత్వ గణతంత్ర వేడుకలలో 13 మంది క్యాడెట్లు, జిల్లా స్థాయి వేడుకలలో 78 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. కావున డిగ్రీ విద్యనభ్యసించగోరే విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సకల సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తును సాకారం చేసుకొనగలరు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *