Breaking News

వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం

-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గురువారం నాడు శాసనసభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ… టీడీపీ హయాంలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేసి జగన్ రెడ్డి వారి పొట్ట కొట్టారని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఎస్సీ ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానం అమలు చేయలేదని విమర్శించారు. బి & సి కేటగిరి కింద మెడికల్ సీట్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. అట్రాసిటీ కేసుల్లో నిందితులకు 41 సీఆర్పీసీ కింద స్టేషన్ బెయిల్ మంజూరు చేశారని అన్నారు. ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.50,000/- అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా నిలిపేశారని వివరించారు.

ఉద్యోగాల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టం సక్రమంగా అమలు కాలేదు. ఎస్సీలకు పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉన్న అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దళితులకు మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి కంసమామలా మారి వారికి ద్రోహం చేశారని అన్నారు. అందుకే దళితులు తిరగబడి రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టారని అన్నారు. గత టిడిపి హయాంలో దళితులకు అన్ని విధాల మేలు చేశామని మంత్రి అన్నారు. 2014 – 2019 లో ఐఎస్ బి సెక్టార్, పశుసంవర్ధక శాఖ కింద బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా 60 శాతం సబ్సిడీతో రూ.2716.70 కోట్లతో 2,02,414 మంది ఎస్సీలకు ప్రయోజనం చేకూర్చామని తెలిపారు. భూమిలేని పేదలకు భూమి కొనుగోలు పథకం ద్వారా రూ. 197 కోట్లతో 2,518 మందికి 2360.77 ఎకరాల భూమి పంపిణీ చేశామని, NSFDC కింద రూ. 552.55 కోట్లతో 10,634 మంది ఎస్సీ యువతకు ఇన్నోవా కార్లు, రవాణా రంగంలో అధిక విలువ గలిగిన ప్రాజెక్ట్ ఆధారిత యూనిట్లు అందించామన్నారు.ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ద్వారా రూ. 29.39 కోట్లతో 669 మందికి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందించామని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా రూ.165.29 కోట్లతో 23,389 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించమన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద రూ.32.23 కోట్లతో 437 మంది విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ఆ పథకానికి అంబేద్కర్ పేరు మార్చి తన పేరు పెట్టుకుని అంబేద్కర్ నే అవమానించారని అన్నారు.

పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ త్వరలోనే తిరిగి పునరుద్ధరిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *