Breaking News

సింగిల్ డెస్క్ విధానంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌త్వ‌ర అనుమ‌తులు

– నిర్దిష్ట గ‌డువులోగా ద‌ర‌ఖాస్తులను ప‌రిష్క‌రించండి
– ఎంఎస్ఎంఈల‌కు రూ. 1.14 కోట్ల విలువైన రాయితీ ప్రయోజనాలు
– డీఐఈపీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగిల్ డెస్క్ విధానం కింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన ద‌ర‌రఖాస్తులను ప‌రిశీలించి.. త్వరితగతిన అనుమతుల జారీకి కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న సూచించారు. శుక్ర‌వారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ సృజ‌న అధ్య‌క్ష‌త‌న జిల్లా పారిశ్రామిక‌, ఎగుమ‌తుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) స‌మావేశం జ‌రిగింది. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి, మెంబ‌ర్ క‌న్వీన‌ర్ ఎ.సుధాక‌ర్, వివిధ శాఖ‌ల అధికారులు, పారిశ్రామిక అసోసియేష‌న్ల ప్ర‌తినిధులు హాజ‌రైన ఈ స‌మావేశంలో 2023, డిసెంబ‌ర్ 31 నుంచి 2024, జులై 25 మ‌ధ్య‌కాలంలో సింగిల్ డెస్క్ విధానం కింద అందిన ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం, సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు త‌దిత‌ర అంశాలపై క‌లెక్ట‌ర్ స‌మీక్షించి ఆదేశాలిచ్చారు. వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 225 ద‌ర‌ఖాస్తులు అంద‌గా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 205 ద‌ర‌ఖాస్తులు ఆమోదం పొందాయ‌ని, 17 ద‌ర‌ఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, మిగిలిన వాటిని తిర‌స్క‌రించిన‌ట్లు తెలిపారు. ప‌రిశీల‌న‌లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని ఏపీఐఐసీ, ఏపీపీసీబీ, ఫ్యాక్ట‌రీలు, అగ్నిమాప‌క సేవ‌ల శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. ఐడీపీ (2015-20), ఐడీపీ (2020-23), బ‌డుగు వికాసం కింద సూక్ష్మ‌, చిన్న, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహం కోసం పెట్టుబ‌డి రాయితీ, పావ‌లావడ్డీ, విద్యుత్ టారిఫ్ తదితర రాయితీల కింద మొత్తం 30 యూనిట్ల‌కు దాదాపు రూ. 1.14 కోట్ల విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం తెలియజేసింది. 2024, జులై 6న జ‌రిగిన స్క్రుటినీ వెరిఫికేష‌న్ క‌మిటీ (ఎస్‌వీసీ) స‌మావేశ నిర్ణ‌యాల‌ను తాజాగా క‌మిటీ ముందు పెట్ట‌గా.. క‌మిటీ వివిధ రాయితీల‌కు ఆమోదం తెలిపింది. ఉపాధి క‌ల్ప‌న‌, ఆర్థిక వృద్ధి ప‌రంగా కీల‌క‌మైన ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు, ఉన్న సంస్థ‌ల సుస్థిర అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌ని.. డీఐఈపీసీ స‌మావేశాల‌ను ప్రతి నెలా నాలుగో శుక్ర‌వారం క్ర‌మంత‌ప్ప‌కుండా నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు. ఈ సమావేశంలో ఫ్యాప్సియా ప్రెసిడెంట్ వి.ముర‌ళీకృష్ణ‌, మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల అసోసియేష‌న్ ప్ర‌తినిధి క‌న‌క‌దుర్గ, ఏపీఐఐసీ జెడ్ఎం కె.సీతారాం, ఎల్‌డీఎం కె.ప్రియాంక‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, డీటీసీ ఎం.పురేంద్ర‌, జిల్లా అగ్నిమాప‌క అధికారి ఏవీ శంక‌ర‌రావు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *