Breaking News

మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు

-మాంగ్రూవ్ సెల్ ఏర్పాటు చేసి పటిష్ట రక్షణ
-కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘మిస్టీ’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్త్రీర్ణం పెంచుతాము
-గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించింది… ఈ అంశంపై ముఖ్యమంత్రి తో చర్చిస్తాము
-తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర కీలకం
-మడ అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి
-కార్పోరేట్ సంస్థలు మడ అడవుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి
-అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర వెలకట్టలేనిది. మానవ తప్పిదాలు మడ అడవుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. వీటి పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మడ అడవులను విధ్వంసం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామ’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులను నియమించి, రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం అరణ్య భవన్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మడ అడవుల రక్షణ, విస్తీర్ణం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “పర్యావరణ పరిరక్షణపై నాకు ఉన్న ప్రత్యేకమైన ఆసక్తే అటవీశాఖ ఎంచుకోవడానికి కారణం. పర్యావరణానికి ఎవరు హాని కలిగించినా దానిపై పోరాటం చేస్తూ ఉండేవాడిని. మడ అడవులు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. ప్రకృతి సౌందర్యంతో పాటు ఎన్నో రకాలు వన్యప్రాణులకు ఆవాసాలుగా ఉంటున్నాయి. మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి రక్షణ కవచంగా ఉన్నాయి. మడ అడవులు ఒక కుటుంబంలా కలిసి పెరుగుతాయి. మడ అడవులు ప్రకృతి ప్రసాదిత వరాలు. తుఫానులు, సునామీల నుంచి తీర ప్రాంతాలను కాపాడడం, వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం కల్పించడం వంటి అంశాల్లో మడ అడవుల పాత్ర కీలకం. మడ అడవులు జాతుల పరస్పర కదలికల్ని సులభతరం చేస్తాయి. అయితే సగటు మనిషికి మడ అడవుల ఆవశ్యకతపై అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మడ అడవులు అవసరం. ఈ అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి.

పారిశ్రామిక వ్యర్ధాలతో మడ అడవులకు ముప్పు
మడ అడవుల నరికివేత, మడ ప్రాంతంలోకి వచ్చి ఆక్వా కల్చర్ చేయడం, పట్టణీకరణ వంటి అంశాలతో మడ అడవులకి ముప్పు పొంచి ఉంది. విధ్వంసానికి పాల్పడితే వాటి పునరుద్ధరణకు శతాబ్దకాలం పడుతుంది. అభివృద్ధి, అక్వా సాగు కావాలంటే మరోచోట చేసుకోవచ్చు. పారిశ్రామిక వ్యర్ధాలు, ప్లాస్టిక్, ఇతర కాలుష్య కారకాలు కూడా మడ అడవులకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు మడ అడవుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. కొంత మంది కలప కోసం, చేపల వేట కోసం మడ అడవులను నాశనం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మడ అడవులకు చట్టపరమైన రక్షణ అవసరం. దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. మడ అడవులను కాపాడేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అనుభవం, ఆసక్తి ఉన్న అధికారులను ఎంపిక చేయాలి. మడ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అవసరం అయితే కార్పోరేట్ భాగస్వామ్యం తీసుకోవాలి. సీఎస్ఆర్ ఫండ్స్ సేకరించి మడ అడవుల అభివృద్ధి, రక్షణకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో మడ అడవులు పెంచే విషయంలో ఎమ్మెస్ స్వామినాథన్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. స్థానికంగా ఉండే ప్రజల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా మడ అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. అవసరం అయితే ఆ ప్రాంతంల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ప్రభుత్వ భూముల్లో మడ ఉంటే అటవీ శాఖ పరిధిలోకి…
గతంలో కోరింగ మడ అడవుల వ్యవహారం నా దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వం 110 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న మడ అడవులు తొలగించి గృహ నిర్మాణానికి ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తాం. ప్రభుత్వ భూముల్లో మడ అడవులు ఉంటే వాటని అటవీ భూములుగా గుర్తించే విధంగా చర్యలు చేపడదాo. అటు ప్రసార మాద్యమాల ద్వారాను మడ అడవుల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.

అయిదేళ్లలో 700 హెక్టారులు లక్ష్యం
ప్రస్తుతం రాష్ట్రంలో 405 చ.కి.మీ. మేర మడ అడవులు ఉన్నాయి. ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో మరో 100 చ.కి.మీ. మేర మడ విస్తరించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మంగ్రూవ్ ఇనీషియేటివ్ ఫర్ షోర్ లైన్ హబీటెట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ (మిస్టీ)’ ద్వారా రాబోయే అయిదేళ్లలో 700 హెక్టార్లలో మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగాపెట్టుకున్నాము. 50శాతం కేంద్రం నిధులు ఇస్తుంది. 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఎకో టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాము. మడ అడవుల పరిరక్షణ, అభివృద్ధి, అక్కడి ప్రజల జీవనోపాధుల మెరుగు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకొంటున్నాము” అన్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, అటవీశాఖ దళపతి చిరంజీవి చౌదరి, వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్  ఎ.కె.నాయక్, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శరవణన్. ఉన్నతాధికారులు శాంతిప్రియా పాండే, రాహుల్ పాండే, సుమన్,  ఆర్పీ కజురియా, రేవతి, శ్రీనివాస రెడ్డి, భరణి, ఎమ్మెస్ స్వామినాథన్ ఫౌండేషన్ ప్రతినిధి రామ సుబ్రమణియం తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *