Breaking News

బాలలను ఉన్నత ఆశయాల వైపు తీర్చిదిద్దాలి .. జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, వారిని ఉన్నత ఆశయాల వైపు వారి బాల్యం నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ అరుణాసారిక అన్నారు.

శనివారం ఉదయం మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయం స్పందన కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక జువనైల్ పోలీస్ యూనిట్ల సభ్యులకు బాలల హక్కుల న్యాయ చట్టాలపై నిర్వహించిన శిక్షణా తరగతులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణా తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దేశ జనాభాలో దాదాపు 25 శాతం ఉన్న బాలల హక్కుల పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయన్నారు. ఉచిత నిర్భంద విద్య, ఆరోగ్య పరిరక్షణ, మానవ అక్రమ రవాణా నిషేధం, వెట్టి చాకిరి నిర్మూలన, బాల బాలికలపై ఆకృత్యాల రక్షణ చట్టం (పోక్సో చట్టం), బాలల న్యాయం, బాల కార్మిక నిర్మూలన వంటి చట్టాలు బాలల సంక్షేమం, ప్రయోజనాలను సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాయని తెలిపారు.

బాలల సంక్షేమమే పరమావధిగా “ప్రత్యేక జువనైల్ పోలీస్ యూనిట్లను” ఏర్పాటు చేసి ఆయా చట్టాలపై జిల్లా, గ్రామస్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రత్యేక జువనైల్ పోలీస్ యూనిట్ల సభ్యులకు బాలల న్యాయ చట్టాల పట్ల మరింత అవగాహన కలిగించేందుకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణాకాలంలో అనేక విషయాలను తెలుసుకుని వాటిని విధి నిర్వహణలో అమలుపరిచే విధంగా బాలల పరిరక్షణకై పాటుపడాలని కోరారు.

జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, కుటుంబ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చెడు స్నేహాల ప్రభావంతో సమాజంలో బాలలు నేరప్రవృత్తి వైపు పయనించేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, బాలలు సన్మార్గంలో పయనించేందుకు తల్లిదండ్రులు, బంధువులు, టీచర్ల ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం అన్నారు. బాలల న్యాయ చట్టాలపై పూర్తి అవగాహన కలిగించుకుని వారిని సమాజానికి విలువైన వారిగా తయారు చేసేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో మత్తు పదార్థాల సేవనం దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ పి రామ్మోహన్ రెడ్డి, హెల్ప్ ఎన్జీవో సెక్రెటరీ ఎమ్మెస్ రామ్మోహన్, ఇతర పోలీసు అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *