Breaking News

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌డాలంటే సీఎం బాబు, పీఎం మోదీ వ‌ల్లే సాధ్యం

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
-ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం
-జ‌గ‌న్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు
-శ‌వ‌రాజ‌కీయాలు, డ్రామా రాజ‌కీయాలు జ‌గ‌న్ కి అల‌వాటు
-ఐదారు నెల‌ల్లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు
-ఎపిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం 76 రైల్వే స్టేష‌న్లు
-ఐదారు నెలల్లో అభివృద్ధి ప‌థంలో రైల్వే స్టేష‌న్, ఎయిర్ పోర్ట్
-ఆరు నెల‌ల్లో వెస్ట్ బైపాస్ ప్రారంభం
-ఏడాదిలోపు ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణం
-విజ‌య‌వాడ-బెంగుళూరు రైలుకి కృషి
-ప‌లు ప్రాంతాల‌కు క‌నెక్టివిటీ వుండే విధంగా విమాన స‌ర్వీసులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంపై ఎంత ఆర్థిక భారం వున్నా అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాలకు ఎలాంటి లోటు లేకుండా అందించ‌టంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సిద్ద‌హ‌స్తుడు. గ‌తంలో 2014-19 లో చేసి చూపించారు. జ‌గ‌న్ అప్పులమ‌యం చేసిన ఈ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని మెరుగుప‌ర్చాలంటే రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ల్లే సాధ్య‌ప‌డుతుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.

అసెంబ్లీకి రాకుండా వైసిపి అధ్యక్షుడు ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ చేస్తున్న దుప్ఫ్ర‌చారాన్ని తిప్పికొడుతూ, రాష్ట్రాభివృద్ది కోసం కేంద్రం చేస్తున్న ఆర్థిక సాయం. అలాగే విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం చేస్తున్న కృషి గురించి శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌లు అంశాల‌పై విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడారు.

సీఎం కృషి వ‌ల్లే అత్య‌ధిక నిధులు:

ప్ర‌స్తుతం లోటు బ‌డ్జెట్ లో వున్న రాష్ట్రాన్ని గ‌ట్టేక్కించి అభివృద్ది ప‌థంలో న‌డిపించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రులు లోకేష్,ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు విధాలుగా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించాడో సీఎం చంద్ర‌బాబు విడుద‌ల చేసిన శ్వేత ప‌త్రం చూస్తే అర్ధం అవుతుంద‌న్నారు. కేంద్రం సాయం కోసం చంద్ర‌బాబుతో పాటు మంత్రులు,ఎంపిలు నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని తెలిపారు. కేంద్ర బ‌డ్జెట్ లో అత్య‌ధిక నిధులు ఎపికి కేటాయించ‌టానికి చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లే కార‌ణ‌మ‌న్నారు. చంద్ర‌బాబు కోరిన విధంగా బ‌డ్జెట్ లో నిధులు కేటాయింపు జ‌ర‌గ‌టం హ‌ర్ష‌ణీయ‌మ‌ని తెలిపారు. గ‌తంలో జ‌గ‌న్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన త‌న స్వార్థ‌ప్ర‌యోజ‌నాల చూసుకున్నాడు త‌ప్పితే, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు.

త్వ‌ర‌లో విజ‌య‌వాడ‌ రైల్వే స్టేష‌న్, ఎయిర్ పోర్ట్ అభివృద్ది

పార్ల‌మెంట్ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ అభివృద్ది ప‌నులు తెలపాల‌ని ప్ర‌శ్నించ‌గా ఈ ప‌థ‌కం కింద విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ ను రాబోయే 50 సంవ‌త్స‌రాలకు ప్ర‌యాణీకుల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అభివృద్ది చేస్తామ‌ని కేంద్ర‌ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స‌మాధానం చెప్పిన‌ట్లు తెలిపారు. అలాగే అమరావ‌తి రైల్వే స్టేష‌న్ ను కూడా అభివృద్ది చేస్తామ‌న్న‌ట్లు తెలియ‌జేశారు. రాజ‌ధాని ప్రాంతంలో జ‌య‌వాడ రైల్వే స్టేష‌న్, అమ‌రావ‌తి రైల్వే స్టేష‌న్ అభివృద్ధి చెంద‌టం రాష్ట్రానికి ఎంతో అవ‌స‌రమ‌న్నారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం రాష్ట్రంలో 76 రైల్వే స్టేష‌న్లు అభివృద్ది చేయ‌నున్న‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఇక విజ‌యవాడ స్టేష‌న్ నుంచి బెంగుళూర్ వ‌ర‌కు కొత్త రైలు స‌ర్వీసు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఇక గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మిన‌ల్ నిర్మాణం ఒక ఏడాదిలోపు ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కేంద్ర మంత్రి కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడును క‌లిసి విజ‌య‌వాడ నుంచి వార‌ణాసి వ‌యా వైజాగ్, విజ‌య‌వాడ నుంచి కొచ్చిన్ వ‌యా హైదారాబాద్, విజ‌య‌వాడ నుంచి కొయాంబ‌త్తుర్ వ‌యా చెన్నై, విజ‌య‌వాడ నుంచి క‌ల‌క‌త్తా వ‌యా వైజాగ్ ప్రాంతాల‌కు గ‌న్న‌వ‌రం నుంచి క‌నెక్టివిటీ విమానాలు పెంచాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో విజ‌య‌వాడ -అహ్మాదాబాద్, విజ‌య‌వాడ -పుణే మ‌ధ్య ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన స‌ర్వీస‌లు ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలిపారు.

అదే విధంగా వెస్ట్ బైపాస్ ను ఐదారు నెల‌ల్లో ప్రారంభిస్తామ‌ని చెప్పారు. గ‌న్న‌వరం నుంచి అమ‌రావ‌తికి ప‌ద‌మూడు ప‌ద్నాలు నిమిషాల్లో వ‌చ్చే విధంగా కనెక్టింగ్ రోడ్లు, రెడియ‌ల్ రోడ్లు నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌హానాడు -నిడ‌మానురు వ‌ర‌కు ఆరు కిలోమీట‌ర్ల ఫ్లైఓవ‌ర్ నిర్మాణం కోసం కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ని క‌లిసి డిపిఆర్ ఈ నెలాఖ‌రుక‌ల్లా స‌మ‌ర్పించే విధంగా చూడాల‌ని కోర‌గా..ఎన్.హెచ్.ఏ.ఐ అధికారుల‌కి ఆదేశాలిచ్చిన‌ట్లు తెలిపారు. తూర్పు బైపాస్ నీతిఆయోగ్ లో ఆమోదం పొంద‌బోతున్న‌ట్లు తెలిపారు. కేంద్ర బ‌డ్జెట్ కి సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప‌లు ర‌హ‌దారులు, జాతీయ ర‌హ‌దారులు అభివృద్ది కాబోతున్న‌ట్లు చెప్పారు. .

జ‌గ‌న్ వి శ‌వ‌రాజ‌కీయాలు
జ‌గ‌న్ అధికారం కోల్పోవ‌టంతో ఆలోచించ‌టం మానేశాడు. అందుకే ఉనికి కోసం ఢిల్లీలో ధర్నా చేశాడు. స‌మాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ను ఆ ధ‌ర్నాకి తీసుకువ‌చ్చి బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైన‌ట్లు జ‌గ‌న్ హ‌డావుడి చేశాడ‌ని ఎద్దేవా చేశారు. ఆ ధ‌ర్నాకి పార్ల‌మెంట్ లోని ప్ర‌తిప‌క్షాల‌ను బ్ర‌తిమిలాడిన ఎవ‌రు రాలేదన్నారు. జ‌గ‌న్ సంగ‌తి తెలిసిన ఆ పార్టీకి నాయ‌కులు జ‌గ‌న్ కి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌న్నారు.

జ‌గ‌న్ అసెంబ్లీకి రాకుండా రాష్ట్రంలో 36 హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు ప్ర‌భుత్వం పై చేస్తున్న దుష్ప్ర‌చారం మానుకోవాల‌ని…ఆధారాలు వుంటే డిజిపి స‌మ‌ర్పించాలి…అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చించాల‌ని సూచించారు. జాతీయ మీడియా చ‌నిపోయిన ఆ 36 మంది వివ‌రాలు అడిగితే జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌లేక పారిపోయాడ‌న్నారు. అధికారం ఇవ్వ‌ని రాష్ట్రం పై కోపం పెంచుకున్న జ‌గ‌న్…రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా చేయ‌టానికి ఇలా చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

జ‌గ‌న్ చెబుతున్న ఆ 36 మంది లో వైయస్ వివేకా నంద రెడ్డి వున్నాడేయో? జ‌గ‌న్ రెడ్డే స‌మాధానం చెప్పాల‌ని చుర‌క‌లు అంటించారు. నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ రాయించి ర‌క‌ర‌కాల విన్యాసాలు చేయించిన వైసిపి నాయ‌కుల ఆగ‌డాలు సాగ‌వ‌ని హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే ఎవ‌రినైనా ఊపేక్షించ‌ర‌న్నారు. తెలుగు దేశం కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబు మాట కోసం సంయ‌వ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలిపారు.

నెల‌కో ప‌థ‌కం అమ‌లు
మాట ఇచ్చి మాట త‌ప్పడం జ‌గ‌న్ కి బాగా అల‌వాటు..ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై విశ్వాసం తో వున్నారు. ఆ విశ్వాసం నిల‌బెట్టుకోవ‌టానికి చంద్ర‌బాబు శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. జ‌గ‌న్ అబ‌ద్దాల కోరు న‌వ‌ర‌త్నాల్లో ఏ ప‌థ‌కం అమ‌లు చేయ‌లేదన్నారు. టిడిపి సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు చిత్త‌శుద్దితో వుంద‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన నెల‌న్న‌ర రోజుల్లోనే అన్ని ప‌థ‌కాలు అమ‌లు చేయ‌టం సాధ్యం కాద‌ని, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని నెల‌కో ప‌థ‌కం అమ‌లు చేయ‌టానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. ఈ ఆగ‌స్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లు ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. రాబోయే ఐదారు నెలల్లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు జ‌రుగుతాయ‌న్నారు.

అధికార పీఠం కోల్పోవ‌టంతో జ‌గ‌న్ వ‌ర్గీయులు చేసిన కుంభ‌కోణాలు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయోన‌ని తెగ భ‌య‌ప‌డుతున్నారు. మంత్రి లోకేష్ ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయ‌లేద‌న్నారు. త‌ప్పు చేసిన నాయ‌కుల‌పై చ‌ట్ట‌ప‌రంగా మాత్ర‌మే చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *