Breaking News

రూ.కోటి విలువైన నూతన వైద్య పరికరాలను ప్రారంభించిన మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సాయంత్రం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని కంటి విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన రూ.కోటి విలువైన అదునాతన వైద్య పరికరాలను రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ క్రమంలో వైద్య పరికరాల పనితీరు, ఉపయోగాలను సంబంధిత వైద్యాధికారులు మంత్రికి వివరించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం మచిలీపట్నం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కంటి సమస్యలకు సంబంధించి వ్యాధుల నిర్ధారణ, చికిత్సల నిమిత్తం కోటి రూపాయల విలువైన అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తీర ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా నీటికాసులు ఏర్పడటం, రెటీనా దెబ్బ తినటం వంటి కంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారని, అలాంటి వారికి ఈ వైద్య పరికరాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. అదేవిధంగా మెల్లకన్ను సమస్య ఉన్నవారికి శాస్త్ర చికిత్స కోసం పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గతంలో రాష్ట్రంలో ఐదు ప్రాంతాలలో కేవలం ఐదు ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే ఏర్పాటు చేశారని, జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఎంతో కృషి చేశామన్నారు. దీని ద్వారా అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశాలు ఏర్పడినట్లు తెలిపారు.

అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఇదే ఆసుపత్రిలో రూ.5 కోట్ల విలువ చేసే ఎంఆర్ఐ స్కాన్ తో పాటు డయాలసిస్ సెంటర్ ను గతంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.

అదే రీతిలో రాబోయే కాలంలో ఆసుపత్రికి అవసరమైన ఇతర వైద్య పరికరాలు, న్యూరాలజీ, కార్డియాలజీకి సంబంధించిన వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవి రమేష్ కుమార్, కంటి విభాగం వైద్యులు డాక్టర్ భానుమూర్తి, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మోటమర్రి బాబా ప్రసాద్, కార్పొరేటర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *