Breaking News

మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలి – సీ.ఐ.డీ ఎస్పీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా ముందుకు రావాలని, సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఎ.హెచ్.టి.యు), మహిళా సంరక్షణ విభాగం-సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత పిలుపునిచ్చారు. ప్రపంచంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత మానవ అక్రమ రవాణా మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిందని ఆమె అన్నారు. 30 జూలై 2024న జరుపుకోబోతున్న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా సంరక్షణ విభాగం, సి.ఐ.డి. హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మానవ అక్రమ రవాణా నిరోధoపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సి.ఐ.డి. ఆంద్ర ప్రదేశ్ ఎ.హెచ్.టి.యు. నోడల్‌ సంస్థతో కలిసి హెల్ప్ & విముక్తి రూపొందించిన వాల్ పోస్టర్‌ను సరిత ఆవిష్కరించారు.

ఈ సంధర్భంగా శ్రీమతి సరిత మాట్లాడుతూ సైబర్ నేరాల ద్వారా మానవ అక్రమ రవాణా కొత్త రూపం దాలుస్తోందని పేర్కొన్నారు. సైబర్ స్కామింగ్ ద్వారా జరిగే మానవ అక్రమ రవాణాను గుర్తించడం, దానిపై చర్చించడం, దృష్టి సారించడం మరియు నిరోధించడం అవసరమన్నారు. ఆర్థిక సైబర్ మోసగాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను మోసం చేయడంతోపాటు కొన్ని ఆగ్నేయాసియా దేశాలకు వారిని అక్రమoగా రవాణా చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మానవ అక్రమ రవాణా ద్వారా ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సీఐడీ ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి క్రూరమైన నేరాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అందుకే ప్రతి జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు (ఏ.హెచ్‌.టి.యూ) ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో, విముక్తి ప్రెసిడెంట్ అపూర్వ, సెక్రటరీ పుష్ప, జాయింట్ సెక్రటరీ మౌనిక మరియు హెల్ప్ కమ్యూనికేషన్ ఆఫీసర్ నితిన్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *