Breaking News

“మీకోసం కార్యక్రమం”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. సోమవారం డిఆర్ఓ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం లో కెఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక— “మీకోసం కార్యక్రమం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 130 అర్జీలు ప్రజల నుండి జిల్లా యంత్రాంగానికి అందాయి. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

-ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి మాజీ అధ్యక్షులు కట్టా హేమ సుందర్, జిల్లా అధ్యక్షులు కోరాటి నారాయణరావు, కార్యదర్శి బి బాలసుబ్రమణ్యం, సిపిఐ ప్రతినిధి ఎం రామారావు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో నెలకొని ఉన్న చేనేత పరిశ్రమ సంక్షోభం నుండి బయటపడటానికి చేనేత సహకార సంఘాలకు తక్షణమే పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని, నేతన్న నేస్తం పథకాన్ని 24 నుండి 34వేల రూపాయలకు పెంచి సొంత మగ్గం ఉన్న వారితో పాటు నేసేవారికి, ఉపవృత్తుల వారికి కూడా వర్తింపజేయాలని, కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి పరికరాలను సబ్సిడీతో పంపిణీ చేయాలని, 11 రకాల చేనేత వస్త్ర ఉత్పత్తుల రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ కల్పించాలని, చేనేతలకు ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని, జౌలి శాఖ నుండి విడదీసి చేనేత పరిశ్రమను కాపాడాలని, చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని, చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇల్లు, వర్క్ షెడ్లు ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి ఇవ్వాలని, సిల్క్ రాయితీని 2000 రూపాయల నుండి 3000 రూపాయలకు పెంచి ఇవ్వాలని, చేనేత కార్మికుల కుటుంబానికి నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అమలు చేయాలని ముద్రా రుణాలు ఇచ్చిన ప్రతిసారి సబ్సిడీ ఇవ్వాలని, చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో నెలకు 5000 వంతున ఆరు నెలల పాటు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు.

-మచిలీపట్నం మండలం కొత్తపూడి గ్రామానికి చెందిన పద్మ తనకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు 1- బి అడంగల్ లో తన భర్త పేరు పి వీర వెంకటేశ్వరరావుకు బదులుగా రాధాకృష్ణ వచ్చిందని దాన్ని మార్పు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

-నాగాయలంక మండలం తలగడ వీధి గ్రామస్తులు భోగాది సోమశేఖర్ మాట్లాడుతూ తన గ్రామంలోని చెరువు చెట్టు చుట్టూ గతంలో కంచె ఉండేదని అది పాడైపోవడంతో కొందరు రౌడీ మూకలు దిమ్మె మీద కూర్చొని మందు తాగుతూ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, వారు చేస్తున్న అల్లరితో నిద్ర లేకుండా పోతుందని ప్రస్తుతం చెరువు చుట్టూ కంచె వేస్తున్నారని కార్యదర్శికి పలుమార్లు చెప్పిన సరైన స్పందన లేదని, ఆ రౌడీ మూకలు కూర్చొని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా చూడాలని ఫిర్యాదు చేస్తూ అర్జీ అందజేశారు.

-మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ కాలనీ రెయిన్బో అపార్ట్మెంట్లో క కాపురస్తులు సింగంశెట్టి అనురాధ తనకు చోడవరం గ్రామంలో అనువంశికంగా ఆర్ఎస్ నంబర్ 55-5, 55-8, 55-9, 56-1లో 6.95 ఎకరాల స్థలం ఉందని తన భర్త శ్రీనివాసు గత సంవత్సరం ఆగస్టు 27వ తేదీన స్వర్గస్తులైనారని అనువంశికంగా తన పేరిట పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్, 1బి అడంగల్ ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

అంతకు మునుపు డిఆర్ఓ అధికారులతో మాట్లాడుతూ చాలా బ్యాంకుల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఖాతాల్లో సరిగా కార్యకలాపాలు జరపక భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారిచే లాక్ చేయబడిందని రెండు రోజుల్లో సంబంధిత శాఖల అధికారులు వాటిని పునరుద్ధరించి తాజా స్థితికి తీసుకొని రావాలని సూచించారు

ఉద్యోగుల గ్రీవెన్స్ రెండో దశలో 33 దరఖాస్తులు రాగా అందులో 21 దరఖాస్తులు పరిష్కరించారని మిగిలిన 12 అర్జీలు కూడా సత్వరమే పరిష్కరించాలన్నారు.

కోర్టు కేసులకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కౌంటర్లు దాఖలు చేయాలన్నారు.

ప్రజల నుండి వచ్చే అర్జీలను గడువు దాటకుండా నిర్మిత సమయంలో పరిష్కరించాలన్నారు.

వచ్చేనెల 15వ తేదీన జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ప్రసంగం తయారు చేయడానికి ప్రగతి నివేదికలను వచ్చే ఆగస్టు నెల 3 వ తేదీ లోగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి పంపాలన్నారు

రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీశాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు ఇకపై ప్రతి ఆదివారం మంగినపూడి సముద్రతీరంలో ఉదయం 6 నుంచి 7 గంటలకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అందుకు అవసరమైన వాహనాలను సమకూర్చాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో మొక్కలు విరివిగా నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఆనంద కుమార్, ఐ సి డి ఎస్ పి డి సువర్ణ, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీత బాయి, డ్వామా
పీడీ సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యు ఎస్ ఈఈలు శ్రీనివాసరావు, శివప్రసాద్, ఎల్డీఎం జయవర్ధన్, సర్వే భూ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి, జిల్లా ఉద్యాన అధికారి జే. జ్యోతి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, డీఈవో తహేరా సుల్తానా తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *