Breaking News

ఈ నెల 31 నుంచి ఆగ‌స్టు 9 వ‌ర‌కు స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌

– సీజ‌న‌ల్ వ్యాధుల క‌ట్ట‌డికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌
– ప‌రిస‌రాలు, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌పైనా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించండి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 31వ తేదీ నుంచి ఆగ‌స్టు 9 వ‌ర‌కు 10 రోజుల పాటు ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని, సీజ‌న‌ల్ వ్యాధుల క‌ట్ట‌డికి రూపొందించిన ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ అమ‌లుకు జిల్లా, డివిజ‌న్‌, మండ‌ల‌, గ్రామస్థాయి అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు.
సోమ‌వారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ నిధి మీనా, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావుతో క‌లిసి స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్, ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ, ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వ్య‌వ‌స్థ (పీజీఆర్ఎస్‌) త‌దిత‌రాల‌పై వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి డివిజ‌న్‌, మండ‌లస్థాయి అధికారులు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు. ప‌ట్ట‌ణ పారిశుద్ధ్యంపై విజ‌య‌వాడ న‌గ‌రపాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ హెచ్ఎం ధ్యాన‌చంద్ర‌, గ్రామీణప్రాంతాల్లో ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మంపై డీపీవో ఎన్‌వీ శివ‌ప్ర‌సాద్ యాద‌వ్‌, ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ స‌న్న‌ద్ధ‌త‌పై డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, పిల్ల‌ల‌పై లైంగిక వేధింపులను అరిక‌ట్టేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సృజ‌న మాట్లాడుతూ జిల్లాస్థాయి, మండ‌ల‌స్థాయి, గ్రామ‌స్థాయి అధికారుల‌తో పాటు ప్ర‌త్యేక అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి గ్రామీణ ప్రాంతాల్లో స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌ణాళిక ప్రకారం ఓహెచ్ఎస్ఆర్‌ల క్లీనింగ్‌; క‌చ్చా, ప‌క్కా డ్రెయిన్ల క్లీనింగ్‌, ఫాగింగ్‌, లైమ్, బ్లీచ్ స్ప్రేయింగ్‌; మ‌లాథియ‌న్‌, బైటెక్స్‌, ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ, పైపులైన్ల మ‌ర‌మ్మ‌తులు త‌దిత‌ర కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల‌ని సూచించారు. అదే విధంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ రోజువారీ పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌తో పాటు ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలన్నారు. ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల అమ‌లుతీరు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు గ్రామ‌స్థాయిలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి, ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్‌, అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్‌, ఏఎన్ఎంతో ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేయాల‌న్నారు. ప్ర‌జ‌లు డెంగీ, మ‌లేరియా త‌దిత‌ర వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా దోమ‌ల వ్యాప్తికి మూల‌కార‌కాల‌ను నాశ‌నం చేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు వ్య‌క్తిగ‌త‌, ప‌రిస‌రాల శుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. త‌ప్ప‌నిస‌రిగా కాచి చ‌ల్లార్చిన నీరు తాగేలా ప్ర‌జ‌ల‌కు పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ప్రైవేటు తాగునీటి ప్లాంట్ల‌ను కూడా త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించారు.
పెన్ష‌న్ల పంపిణీకి పూర్తి స‌న్న‌ద్ధ‌త‌:
జులైలో మాదిరిగానే ఆగ‌స్టులో కూడా ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీని విజ‌య‌వంతం చేయాల‌ని.. తొలిరోజే పూర్తిస్థాయిలో పంపిణీ పూర్తిచేసేలా స‌న్న‌ద్ధంగా ఉండాల‌న్నారు. మొత్తం 2,34,143 పెన్ష‌న్ల‌కు సంబంధించి రూ. 98.80 కోట్ల మేర మొత్తాన్ని ప్ర‌భుత్వ ఉద్యోగుల ద్వారా ల‌బ్ధిదారుల‌కు ఇంటివ‌ద్దే పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్ష‌న్ల పంపిణీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌తిసోమ‌వారం ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వ్య‌వ‌స్థ (పీజీఆర్ఎస్‌) ద్వారా వ‌చ్చే అర్జీల‌ను నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. బాల్యం-అమూల్యం, పిల్ల‌ల ర‌క్ష‌ణ మ‌నంద‌రి బాధ్య‌త.. ఈ నేప‌థ్యంలో పిల్ల‌ల‌పై లైంగిక దాడుల నివార‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషిచేయాల‌ని, పాఠ‌శాల‌లు, అంగ‌న్వాడీ కేంద్రాలు, సంక్షేమ వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు గుడ్ ట‌చ్‌-బ్యాడ్ ట‌చ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న సూచించారు.
స‌మావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఈవో ఎస్‌వీ సుబ్బారావు, కేఆర్ఆర్‌సీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఇ.కిర‌ణ్మ‌యి, ఆరోగ్య‌శ్రీ స‌మన్వ‌యక‌ర్త డా. జె.సుమ‌న్‌, జీఎం-డీఐసీ ఎ.సుధాక‌ర్‌, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, ఏపీ ఎంఐపీ పీడీ పి.ఎం.సుభానీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *