Breaking News

ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీకి పూర్తిస్థాయి ఏర్పాట్లు

– తొలిరోజే 99 శాతం మేర పంపిణీకి కృషి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగ‌స్టు 1, గురువారం ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద చేప‌ట్టే సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్‌… అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, ఎల్‌డీఎం కె.ప్రియాంక‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా చేప‌ట్టేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌తో మాట్లాడారు.
ఉద‌యం ఆరు గంట‌ల‌కు పెన్ష‌న్ పంపిణీని ప్రారంభించి.. ప్ర‌క్రియ సాఫీగా సాగేలా చూడాల‌న్నారు. ల‌బ్ధిదారుల సామాజిక భ‌ద్ర‌త ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని తొలిరోజే 99 శాతం మేర పూర్తిచేసేందుకు కృషిచేయాల‌న్నారు. ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు ఇందుకు క్షేత్ర‌స్థాయి సిబ్బందితో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. జిల్లాలో 2,34,143 మంది పెన్ష‌న్‌దారుల‌కు రూ. 98.80 కోట్ల మేర మొత్తాన్ని అందించాల్సి ఉంద‌ని… పెన్ష‌న్ల పంపిణీకి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ల‌బ్ధిదారుల‌తో మ్యాప్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఎ.కొండూరు మండ‌లంలో 7,485 పెన్ష‌న్లు, చంద‌ర్ల‌పాడులో 10,017, జి.కొండూరులో 8,728, గంప‌ల‌గూడెంలో 11,583, ఇబ్ర‌హీపట్నంలో 4,845, జ‌గ్గ‌య్య‌పేట (అర్బ‌న్‌)లో 4,910, జ‌గ్గ‌య్య‌పేట‌లో 10,338, కంచిక‌చ‌ర్ల‌లో 10,363, కొండ‌ప‌ల్లి (అర్బ‌న్‌)లో 5,305, మైల‌వ‌రంలో 9,734, నందిగామ‌లో 8,048, నందిగామ (అర్బ‌న్‌)లో 4,298, పెనుగంచిప్రోలులో 8,580, రెడ్డిగూడెంలో 7,284, తిరువూరులో 6,865, తిరువూరు (అర్బ‌న్‌)లో 3,430, వ‌త్స‌వాయిలో 9,693, వీరుళ్ల‌పాడులో 8,841, విజ‌య‌వాడ (అర్బ‌న్‌)లో 68,224, విజ‌య‌వాడ రూర‌ల్‌లో 17,277, విస్సన్న‌పేట మండ‌లంలో 8,295 పెన్ష‌న్లు ఉన్న‌ట్లు వివ‌రించారు. 31వ తేదీ సాయంత్రంలోగా బ్యాంకుల నుంచి న‌గ‌దును విత్‌డ్రా చేసి, పంపిణీ ప్ర‌క్రియ‌ను స‌ర‌ళీకృతం చేసేలా డినామినేష‌న్ సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. పెన్ష‌న్ల పంపిణీ జ‌రుగుతున్న తీరును ఎప్ప‌టిక‌ప్పుడు ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు ప‌ర్య‌వేక్షించి, పంపిణీ సాఫీగా సాగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న పేర్కొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *