Breaking News

వేగం కంటే ప్రాణం విలువైనది..

-ద్విచక్ర వాహనదారులందరూ చట్టపరంగా తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలి. భద్రతా నియమాలు పాటించాలి
-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కోసం ర్యాలీ ని నిర్వహిస్తున్నాం..
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పు గోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, డి ఎల్ ఎస్ ఏ ఛైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కార్యాలయం నుంచి లాలా చెరువు వరకు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ద్విచక్ర వాహనదారులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలన్నారు. వినియోగ దారులు ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో హెల్మెట్ ను తీసుకోవడం వల్ల ఆయా షాపు యజమానులు తక్కువ రేట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డుమీద పడిపోయినప్పుడు ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా హెల్మెట్ వలన ప్రాణ భద్రతతో పాటు సురక్షిత కవచంగా ఉంటుందన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు ప్రకారం హైకోర్టు ద్వారా ఆదేశాల మేరకు ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించు కుంటున్నామన్నారు. సిఎస్ఆర్ నిధులు ద్వారా సాధారణ ప్రజలకు హెల్మెట్ ను అందించే క్రమంలో సర్వే కోసం రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని కొన్ని పరిశ్రమలకు ఈమెయిల్ పంపించడం జరిగిందని, హెల్మెట్ డొనేట్ చేసేందుకు ఆయా పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత హైకోర్టు వారి సూచనల మేరకు రాజమండ్రి లోని కొంత మంది సాధారణ ప్రజలకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. హెల్మెట్ విలువ రు. 1000 రూపాయల నుంచి రు.1500 వరకు మాత్రమే ఉంటుందని, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని, కావున ద్విచక్ర వాహన చోధకులు తప్పనిసరిగా హెల్మెట్లను వినియోగించి రోడ్డు ప్రమాదాల భారీ నుంచి తమ జీవితాలకు భద్రతను కల్పించుకోవాలన్నారు.

జిల్లా రవాణా శాఖ అధికారి కే వి కృష్ణారావు మాట్లాడుతూ రహదారి ప్రయాణాల్లో ఎక్కువమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడుతున్నారన్నారు. చట్ట ప్రకారం ద్విచక్ర వాహనదారులందరు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించుకొని తమ అమూల్యమైన ప్రాణాలను ప్రమాద బారి నుండి రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి హెల్మెట్ వినియోగము పై అవగాహన కల్పించే విధంగా నేడు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టు ఆవరణ నుంచి లాల చెరువు వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జే. నరసింహులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.ప్రకాష్ బాబు,జిల్లా రవాణా శాఖ అధికారి కే వి. కృష్ణారావు, జిల్లా అదనపు న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మెంబర్లు, న్యాయవాదులు, ట్రాఫిక్ సిబ్బంది, పారా లీగల్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *