Breaking News

సహకార సంఘాల్లో మెక్కినదంతా కక్కిస్తాం

-అవినీతి చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు..
-ఒక్క రోజులో రైతుకు రుణం మంజూరు చేసేలా చర్యలు
-సహకార సంఘాల ద్వారా రూ.38.7 వేల కోట్ల రుణాలు..
-ఆప్కాబ్ – డీసీసీబీల రుణ అంచనా ప్రణాళిక..
-రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి.
-ప్రతి జిల్లాలో ఆప్కాబ్, డీసీసీబీ బ్రాంచ్ ల ఏర్పాటు
-ఆప్కాబ్ అధికారులకు ఆదేశాలు
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కంజరాపు అచ్చెన్నాయుడు 

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల పరిధిలో అవినీతి, అక్రమాలతో మెక్కినదంతా కక్కిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అనేక చోట్ల నకిలీ ధృవపత్రాలతో రుణాలు, రైతుల పేరుతో అదనపు రుణాలు, అధికారులే బినామీ పేర్లతో రుణాలు పొందిన అంశాలు తన దృష్టికి వచ్చాయని, సహకార వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

రుణం కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగే రోజులు పోవాలని, ఒక్క రోజులో రైతుకు రుణం అందించే విధంగా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేసి త్వరలో ఆ దిశగా చర్యలు ప్రారంభించాలని సూచించారు. రైతు ఆధార్ కార్డు తో మీ భూమి, ఈసీ, ఈ క్రాప్ అనుసంధానం చేసి రుణాల కోసం వచ్చే రైతులకు అత్యంత వేగంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సహకార సంఘాలను ఆన్ లైన్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆప్కాబ్ – డీసీసీబీల నుంచి సహకార సంఘాల ద్వారా ఈ ఏడాది రూ.38.7వేల కోట్లు అందించేందుకు అంచనా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

రుణాలు మంజూరు చేసే క్రమంలో జాప్యం లేకుండా చూడాలని, రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వ్యవసాయ పంట రుణాలతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాలు, రైతుల పిల్లల చదువు నిమిత్తం విద్యా రుణాలు, విదేశీ విద్యా రుణాలు మంజూరు చేసేందుకు ఆప్కాబ్ మరింత వేగం పెంచాలని మంత్రి అచ్చెన్నాయుడు గారు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో డీసీసీబీ, ఆప్కాబ్ బ్రాంచ్ ల ఏర్పాటుకు కసరత్తు వేగవంతం చేయాలని, అనుమతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తక్షణమే దరఖాస్తు చేయాలని ఆదేశించారు.

గ్రామ స్థాయిలో మహిళా మండలి(ఎస్.హెచ్.జీ) రుణాలు, ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన రుణాలు, ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన రుణాలు మంజూరులో ఆప్కాబ్ బ్రాంచ్ లు, డీసీసీబీలు తమ సేవలు మరింత విస్తృతం చేయాలని సూచనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించిన రాయితీ రుణాలతో పాటు హామీ లేని రుణాలు (సీ.జీ.టీ.ఎమ్.ఎస్) రుణాలు మంజూరు గురించి ప్రజలకు అవగాహన పెంచి సాధ్యమైనంత ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆప్కాబ్ ఎండీ శ్రీనాధ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *