Breaking News

అవయవదానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపవచ్చు

-అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి
-అవయవ దానంతో మరొక వ్యక్తికి పునః జన్మనివ్వచ్చు..
-ఏటా ఐదు లక్షల మంది అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారు
-జాతీయ స్థాయిలో సైతం అవయవదానం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి
-అవయవదానం చేసిన వారి అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్, SP పాల్గొని వీరవందనం చేసేలా చర్యలు
-అవయవదానం చేసిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాము
-సత్యకుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి, జీవన్ దాన్ తో మరొక వ్యక్తికీ పునః జన్మనివ్వవచ్చునని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ అన్నారు. జీవన్ దాన్ ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన వారోత్సవాల్లో భాగంగా అవయవదానంపై అవగాహన సదస్సు ను విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని, అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శరీరం శాశ్వతం కాదని, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుందని, అదే అవయవదానం చేస్తే ఒక్కోక్కరు 8 మందికి ప్రాణదానం చేయవచ్చన్నారు. దేశంలో కొన్ని మతాచారాలు ప్రకారం అవయవదానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం అవ్వడనుకుంటున్నారని, కాని సాటి మనిషి ప్రాణం నిలబెడితే ఆ దైవం కూడా వారి వెంట ఉంటాడని గుర్తు చేశారు. తీసుకోవడానికి లేని ఇబ్బంది ఇవ్వడానికి ఎందుకు అడ్డం వస్తుందని ప్రశ్నంచారు. సమాజం కోసం పాటు పడిన మహోన్నత వ్యక్తులను ఇప్పటికీ మనం గుర్తుచేసుకుంటున్నామన్నారు. వారి బాటలోనే మనం నడవాలని నలుగురికి సాయపడాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.
మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 260 మంది అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారని, వారికి అభినందనలు తెలుపుతూ ఈ సంఖ్య మరింత పెరిగితే మరో వ్యక్తికీ జన్మ ప్రసాదించినవారిమవుతామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రంలో 90 వేల మంది అవయవదానం దాతల కోసం ఎదురుచూస్తున్నారని, ఏటా ఐదు లక్షల మంది అవయవాలు చెడిపోవడం వల్ల ప్రాణాలు కొల్పోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో చాల స్వల్పంగా అవయవదాన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, దేశ నిష్పత్తి 0.9 ఉండగా రాష్ట్రం నిష్పత్తి 0.3 ఉందని గుర్తుచేశారు. కిడ్నీ మార్పిడి కోసం 2600 మందికి పైగా ఎదురుచూస్తున్నారని, డయాలసిస్ సెంటర్ల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థిస్తున్నారన్నారు. యాక్సిడెంట్ లలో, సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ ఐదేళ్లలో 913 మంది అవయవాలు ట్రాన్స్ ప్లాంటేషన్ చేశామని, ఈ ఏడాది ఇప్పటి వరకు 128 మందికి అవయవాలు మార్చగలిగామని, ఈ ఏడాది లక్ష్యం 200 గా నిర్ణయించుకున్నామని, దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో అవయవాలు అవసరమైన వారికి అందించి వారి ప్రాణాలను కాపాడతామన్నారు. జీవన్ దాన్ కు వయస్సుతో సంబంధం లేదని, ఆరోగ్యంగా ఉంటే చాలన్నారు. అవయవదానం చేసేలా దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, అధికారులు, వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఎన్జీవో సంస్థలు, వైద్యశాలలు తమ పరిధిలో కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు విజన్ ఉన్న నాయకులని వారి సహకారంతో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని తెలిపారు. ఇప్పటి వరకు అవయవదానం చేసిన వారి అంత్యక్రియల్లో వైద్యులు, వాలంటీర్లు పాల్గొని వీరవందనం సమర్పిస్తున్నారన్నారు. ఇకపై వారితో పాటు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన వీరవందనం సమర్పించేలా సీఎం తో మాట్లాడతానని అన్నారు. అలాగే అవయవదానం చేసిన కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ అవయవదానం దినోత్సవం సందర్భంగా ఈ నెల 3 న కేంద్రం అందించే అవార్డుకు మన రాష్ట్రం ఎంపికైందని ఇది సంతోషకరమైన విషయమన్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ వంతుగా సభ్యత్వాలు స్వీకరించే సమయంలో వారి కార్యకర్తలకు అవయవదానంపై అవగాహన కల్పించి వారచేత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. వేధిక సాక్షిగా మంత్రి తాను అవయవదానానికి సమ్మతి తెలిపారు. అందుకు అవసరమైన ప్రోసీజర్ ను వేధికపైనే అప్పటికప్పుడు పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు.
ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్ మూటగట్టుకున్నారని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ తీసేశారని విష ప్రచారం చేస్తున్నారని కాని ఎన్టీయార్ వైద్య సేవగా పేరు మార్చామని వివరించారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు సేవలుగత ప్రభుత్వంలో బకాయిల వలన నిలిపివేస్తామని లేఖ రాస్తే దానికి ఒక పత్రికలో రోజూ విషం చిమ్ముతున్నారని, కాని గత ఏడాది వారి పాలనలో 14 సార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. రాష్ట్రానికిమంజూరైన17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను సైతం పూర్తి చేయలేకపోయారని ఎద్దేవచేశారు. కనీసం మాజీ సీఎం సొంత జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ పూర్తి చేయలేక పోయారన్నారు.

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ దశాబ్ధ కాలంకు పైగా నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో దాతలు ముందుకు వస్తున్నారని, అలాగే అవయవదానంపై అవగాహన కల్పించి దాతల సంఖ్య వందల నుండి వేలకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవయవాలు మరోకరిలో అమర్చడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని కాని మన వైద్యులు దానిని సుసాధ్యం చేసి చూపిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏటా లక్షల మంది అవయవాలు పాడైపోయి మృతి చెందుతున్నారని, వారికి ప్రాణదానం చేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల వారికి పునర్జన్మను ప్రసాదించిన వారిమవుతామని వివరించారు. మన రాష్ట్రానికి ఎయిమ్స్ వైద్యశాల ఏర్పాటులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంతో ఉందని, దీంతో కేవలం రూ. 10 కే ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, అద్భుతమైన ప్రతిభ కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నారని, అతి తక్కువ ఖర్చుతో పూర్తి వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు.

విమ్స్ డైరక్టర్ డాక్టర్ కె. రాంబాబు మాట్లాడుతూ అవయవదానం పూర్తి పారదర్శకంగా ఉంటుందని, అపోహలకు తావే ఉండదని అన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో విస్తృతంగా అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అవయవదానం చేసిన వ్యక్తి అంత్యక్రియలకు వైద్య సిబ్బంది, వాలంటీర్లు హజరై వీరవందనం సమర్పిస్తామని, డోనర్ ఫ్యామిలీకి ప్రశంసా పత్రం కూడా అందిస్తామన్నారు. సినీ ప్రముఖులు నాగార్జున, మురళీ మోహన్, జగపతిబాబు తదితరులు అవయవదానానికి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారన్నారు.
అనంతరం అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను వేదికపై మంత్రి చేతుల మీదుగా ఘన సత్కారం చేశారు. ముందుగా విజయవాడ పట్టణంలోని ఏలూరు లాకుల నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు వాలంటీర్లు, పట్టణంలోని వైద్యకళాశాలల పారా మెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ వాకథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో జీవన్ దాన్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ డి.ఎస్.వి.ఎల్. నరసింహం, గుంటూరు, విజయవాడ జీజీహెచ్ సూపరిండెంట్లు డాక్టర్ వై. కిరణ్ కుమార్, డాక్టర్ డి. వెంకటేశ్వరరావు, వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది, కళశాలల విద్యార్థులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *