Breaking News

ఉచిత మెగా మెడికల్ క్యాంపు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ వైద్య సేవ కింద బీమా పద్ధతిలో 25 లక్షల వరకు వైద్యం అందించే పాలసీ త్వరలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక పోతేపల్లి జ్యువెలరీ పార్కులో బిగ్ టీవీ, మానవత స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును మంత్రి వైద్యుల బృందంతో కలిసి ప్రారంభించారు. వైద్య సేవలు పొందిన రోగులకు మంత్రి మందులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా బిగ్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపులు అభినందనీయమని, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించుటకు మరిన్ని మీడియా సంస్థలు ముందుకు రావాలని సూచించారు. నేటి ఆహారపు అలవాట్లు, కాలుష్య వాతావరణం తదితర కారణాలతో రోగాల బారిన పడుతున్న అనేకమంది ఆసుపత్రులలో ఎంతో వ్యయం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. సామాజిక సేవా దృక్పథంతో పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందించుటకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, యోగ ప్రయోజనాలు పట్ల అవగాహన కల్పించేందుకు మచిలీపట్నంలో వివిధ అసోసియేషన్ల సహకారంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేంద్ర వైద్య పథకాలతో జోడించి బీమా పద్ధతిలో 25 లక్షల వరకు వైద్య సేవలు పొందే విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో ప్రకటించనున్నారని మంత్రి తెలిపారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నదని, అందులో భాగంగా మచిలీపట్నంలో బైపాస్ రోడ్ లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 10 వైద్య విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యులు వైద్య సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు అధ్యక్షత వహించగా మానవత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీరామ్, బిగ్ టీవీ ప్రతినిధి శివ, పార్లమెంటు మాజీ సభ్యులు కోనకళ్ళ నారాయణరావు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *