Breaking News

ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల ప్రజలు ఎన్నో ప్రయాసలకు ఓర్చుకొని జిల్లా కేంద్రానికి వస్తుంటారని వారి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు. ప్రజల నుండి మొత్తం 94 అర్జీలను జిల్లా యంత్రాంగం స్వీకరించింది.

ఇందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

ఘంటసాల మండలం ఎండకుదురు గ్రామం శివారు జీలగలగండి గ్రామస్తులు అల్లు శివరామకృష్ణ ప్రసాద్ తన భార్య బాల దుర్గ పేరున సర్వే నెంబర్ 365/8 లో 1.30సెంట్లు భూమి కలదని అది 22 ఏ కింద ఉన్నందున సంవత్సరమున్నర నుండి తమ భూమి 22- ఏ నుండి తొలగించాలని కోరుతూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని తనకు ఇద్దరు ఆడపిల్లలని వారి చదువు కోసం , పెళ్లి కోసము అప్పులు చేశామని తీర్చడానికి భూమి అమ్మాలనుకుంటే అమ్మ లేని పరిస్థితి, 22ఏలో ఉన్నందున ఎవరు ముందుకు రావడం లేదని తమ భూమిని ఇకనైనా 22- ఏ పరిధి నుండి తొలగించి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

ఉయ్యూరు సోమేశ్వర స్వామి దేవస్థానం ఈవో సురేష్ ఫిక్స్ డిపాజిట్ల వడ్డీ 4 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపన శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

కోర్టు కేసులకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించి అత్యంత జాగ్రత్తగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

జిల్లాలో 8 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, వాటికి ప్రాథమిక దశలోనే కౌంటర్లు దాఖలు చేసి ముగించే మార్గం చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా కొన్ని అర్జీలు వస్తున్నాయని వాటిని తేలికగా తీసుకొని ముగించరాదని, క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యతగా సమాధానం వీలైనంతవరకు తెలుగులో తెలపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈనెల 20వ తేదీన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా ముందస్తుగా ప్రచారం నిమిత్తం గోడ పత్రాలను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే హెచ్ఐవి స్థితిగతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే గోడపత్రాలను కూడా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు, కిశోర బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహారం లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని, శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపాలు కలిగి ఉంటారని చెప్పారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలలో ఉచితంగా ఇవ్వబడే 400 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్ మాత్రలను వినియోగించి నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, డ్వామా పీడీ సూర్యనారాయణ, డిఎస్ఓ పార్వతి, డిపిఓ నాగేశ్వరరావు నాయక్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి, సిపిఓ గణేషు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *