Breaking News

ప్రజలకు సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించేలా ఆసుపత్రుల ప్రక్షాళన

-ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలు
-దశల వారీగా స్వల్ప, మధ్య, దీర్ఝకాలిక ప్రణాళికలు అమలు చేసేందుకు చర్యలు
-ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదు, ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించాం మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లిస్తాం
-గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది
-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల పనితీరు మెరుగుకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళికను స్వల్ప, మధ్య మరియు దీర్ఝ కాలిక ప్రాదిపదికన అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, జిజిహెచ్ల సూపరింటెండెంట్లు మరియు ఇతర ఆసుపత్రుల ప్రతినిధులతో మేథోమదన కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమైందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రల్లో పారిశుద్య కార్యక్రమాలను మెరుగు పర్చి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఓపీ సేవల్లో ఎటు వంటి అవాంతరాలు లేకుండా చూడటం, రోగులకు సహకరించేందుకు హెల్త్ డెస్కులు ఏర్పాటు చేయడం, వైద్యులు, రోగనిర్ధారణ పరికరాలు, యంత్రాల పనితీరును పర్యవేక్షించడం, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చడం, వైద్యాధికారులు, సిబ్బంది కొరత నివారణకై ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 వేల వైద్యాధికారుల సేవలు అవసరం ఉండగా, ప్రస్తుతం 3,100 వైద్యాధికారుల కొరత ఉందని, ఆ కొరత నివారణకు ఖాళీ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడు నుండి ఆరు మాసాల కాల వ్యవధిలో స్వల్పకాలిక ప్రణాళికను, ఏడాది వ్యవధిలో మధ్య కాలిక ప్రణాళికను అమలు చేయడంతో పాటు దీర్ఝకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. స్వ‌ల్ప‌కాలిక ప్రణాళిక అమల్లో భాగంగా ఆసుప‌త్రుల ప్రాంగ‌ణాలను ఆహ్లదకరంగా తీర్చిదిద్దడం, టాయిలెట్ల, బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ను ప‌టిష్టంగా నిర్వ‌హించడం, స్ట్రెచ‌ర్లు, వీల్‌చైర్లు, మహాప్రస్థానం వాహనాలు అవసరం మేరకు సమకూర్చుకోవడం, మగ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్ఓ)లు, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్ఓ)లు, ల్యాబ్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల కొర‌త‌ను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీనియర్లు/స్పెషలిస్ట్ వైద్యులు తప్పనిసరిగా ఓపి విధులకు హాజరయ్యేలా చూడటం, టెస్టుల రిపోర్టు వివరాలు ఎస్.ఎం.ఎస్. ద్వారా రోగులకు తెలియజేయడం, ఆసుపత్రుల్లో అవినీతిని నియంత్రించేందుకై ‘104’ కి కాల్ చేసి ఫిర్యాదు చేసేలా ప్రోత్స‌హించడం మరియు ‘108’ సర్వీస్ సిబ్బంది మరియు క్యాజువాలిటీ వైద్యుల బృందం మధ్య సమర్ధవంతమైన సమన్వయం ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఏడాది కాలంలో మధ్యకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా ఎక్స్-రే యంత్రాలు, సిటి స్కాన్లు, ఎంఆర్ఐ, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ సిస్టమ్స్ వంటి వివిధ రోగనిర్ధారణ పరికరాలు మరియు యంత్రాలు అవ‌స‌రాల మేర‌కు సమకూర్చుకోవడం, వివిధ విభాగాల‌ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు టెక్నీషియన్లు, ఎంఎన్ఓలు/ఎఫ్ఎన్ఓలు వంటి కీలక పోస్టులను భర్తీ చేయడం మరియు ఆప‌రేష్ థియేట‌ర్ల‌లో సూక్ష్మ జీవుల సంక్ర‌మ‌ణ‌(ఇన్ఫెక్ష‌న్ )ను నివారించ‌డానికి శీత‌లీక‌ర‌ణ (ఏసీ) వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా అన్ని ప్రభుత్వ స‌ర్వ‌జ‌న ఆస్పత్రులలో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో-ఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, క్యాన్సర్ కేర్ ( రేడియేషన్ ఆంకాలజీ, రేడియో థెరపీ మరియు సర్జికల్ ఆంకాలజీ ) సూప‌ర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవ మార్పిడి సేవ‌లను, వైద్యులకు సమర్థవంతమైన డిజిటల్ లైబ్రరీ సేవను అందుబాటులోకి తేవడంతో పాటు నాణ్య‌త‌తో కూడిన ఆధునిక వైద్య సేవ‌లు అందించ‌డానికి అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండదు…. పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెపుతూ ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదన్నారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపునకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతలో రూ.162 కోట్లు, రెండో విడతలో నేడు రూ.200 కోట్లు ఇవ్వడం జరిగిందని, మరో వారం రోజుల్లో రూ.300 కోట్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోషియేషన్ దాదాపు 13 సార్లు నోటీసుల ఇచ్చినా సరే స్పదించలేదని, కానీ తమ ప్రభుత్వానికి ఒక సారి నోటీసు ఇచ్చిన వెంటనే స్పందిస్తూ ఆయా ప్రతినిధులతో పలు మార్లు చర్చలు జరిపి ఇప్పటి వరకూ దాదాపు రూ.662 కోట్లు చెల్లించేందుకు చర్యలు చేపట్టడమైందన్నారు. ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ దాదాపు రూ.2,100 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని, మరో రూ.400 కోట్లు అప్ లోడ్ చేయాల్సి ఉందన్నారు. మొత్తం మీద దాదాపు రూ.2,500 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 35 శాతం మేర బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు. అసోషియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రతి నెలా వారికి చెల్లింపుపలు చేసే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోనున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందనీ, ఎవర్నీ వదిలిపేట్టేదిలేదని మంత్రి స్పష్టం చెప్పారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ సి.హరికిరణ్, ఏపీఎంఐడిసి ఎం.డి. మరియు ఎస్టీఆర్ వైద్య సేవ సి.ఇ.ఓ. డా.జి.లక్ష్మీషా, వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం, వైద్య విద్య అదనపు సంచాలకులు రఘునందన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *