-స్మార్ట్ సిటీ దిశగా ప్రణాళికలు
-విజయవాడ అభివృద్దే లక్ష్యం
-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) నగర ప్రజల అభివృద్ధి ,సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ, సభ్యునిగా పనిచేసిన సుజనా పశ్చిమ శాసనసభ్యునిగా గెలుపొందిన నాటి నుంచి పాలనపై పట్టు బిగించి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వరుస రివ్యూ లతో బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారులు, ఉద్యోగులకు, నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైన దృష్టి సారించారు. నగర అభివృద్ధి కోసం లోతుగా అధ్యయనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలనే దిశగా అధికారులతో చర్చలు జరుపుతున్నారు.శుక్రవారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో నియోజకవర్గ అభివృద్ధి పై సుజనా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వి ఎమ్ సి మున్సిపల్ కమిషనర్ జ్ఞాన చంద్ర, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, తొ పాటు ఇంజనీర్లు ,ఇతర అధికారులు, హాజరయ్యారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రతి శాఖకు సంబంధించిన కార్యక్రమాల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. నగరాభివృద్ధి కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందనే దానిపై చర్చించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల స్థితిగతులపై (వి ఎమ్ సి) ప్రజారోగ్య, హార్టికల్చర్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విఎంసి కమిషనర్ జ్ఞాన చంద్ర వివిధ ప్రాజెక్టుల స్థితిగతులను సుజనా కు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, విద్య, వైద్యం, ప్రసూతి ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయడం, గత ప్రభుత్వ పాలనలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ , అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించాలని సుజనా అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి విజయవాడ ను స్మార్ట్ సిటీగా తయారు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సుజనా తెలిపారు.