Breaking News

పారిశ్రామికవేత్తలు తమ సూచనలు సలహాలు అందించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానం ప్రభుత్వం అమలు చేయుటకు పారిశ్రామికవేత్తలు తమ సూచనలు సలహాలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది.

తొలుత సమావేశంలో ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024-29 ప్రకటించనున్నదని, ఇందుకోసం జిల్లాలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఈ సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు తమ సూచనలు సలహాలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేయాలని కోరారు. పారిశ్రామికవేత్తల సూచనలు సలహాలు వారి సమస్యలు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. తద్వారా మెరుగైన పారిశ్రామిక విధానం ప్రభుత్వం అమలు చేయుటకు వీలవుతుందన్నారు.

ఈ సమావేశంలో ఏపీఐఐసీ మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఆహార, వ్యవసాయ, టెక్స్ టైల్ ఉత్పత్తులకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యుయలరీ, ఆక్వా, ప్లాస్టిక్ పరిశ్రమల, ఎమ్మెస్ ఎం ఈ పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొని పారిశ్రామికంగా తమ ఎదుర్కొంటున్న సమస్యలు ఉత్తమ పారిశ్రామిక విధానం అమలుకు సూచనలు, సలహాలు తెలియజేశారు.

ముఖ్యంగా ఏ పరిశ్రమ కైనా విద్యుత్తు చాలా ప్రాముఖ్యమైనదనీ, పరిశ్రమల మనుగడకు విద్యుత్తు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, విద్యుత్ టారిఫ్ ఎంతో కీలకమని, ప్రస్తుత విద్యుత్ టారిఫ్, ట్రూ అప్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నందున తగ్గించవలసిన అవసరం ఉందని, ప్రస్తుతం అమల్లో ఉన్న పరిశ్రమలకు విద్యుత్ ఇన్సెంటివ్స్ బకాయిలు పేరుకుపోయాయని, వెంటనే పరిశ్రమలకు పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ చెల్లించాలని, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసి) చార్జీలు నాలుగు రెట్లు పెంచారని, జీఎస్టీ తగ్గింపు చేయాలని, గుజరాత్లో అమలులో ఉన్న విధానం పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతులు మంజూరు చేయాలని పారిశ్రామికవేత్తలు కోరారు. 2015- 20 పారిశ్రామిక విధానం చాలా బాగుందని, దీనిలోని అంశాలు నూతన విధానంలో చేర్చాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలకు సంబంధించి రా మెటీరియల్ సబ్సిడీ ఇస్తే బాగుంటుందని సూచించారు.

మల్లవల్లి పారిశ్రామిక వాడలో స్కిల్ హబ్ ఏర్పాటు చేయాలని, తద్వారా నైపుణ్యాభివృద్ధికి కృషి చేయడం, పరిశ్రమదారులను నైపుణ్య శిక్షణ పొందిన వారిని ఒకే ప్లాట్ ఫామ్ పైకి తీసుకువచ్చి పారిశ్రామికవేత్తలు క్యాంపస్ ఎంపికలు చేసుకునేలా చూడాలని పలువురు పారిశ్రామికవేత్తలు సూచించారు. ఈఎస్ఐ అమలు చేయాలని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జయవర్ధన్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *