-పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చును: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారులతో కలిసి ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని, ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 2024 థీమ్, “మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయడం”, మలేరియాను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుందనీ అన్నారు. మలేరియా వ్యాధి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో మలేరియా ఎక్కువగా సంభవిస్తున్నందున ఈ రోజున మనం ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రభుత్వం ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు చేపట్టాలని, ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగించాలని అధికారులకు సూచించిందని అన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, ఇళ్లలోని టైర్లలో, ఫ్రిడ్జ్ లో, కూలర్ వంటి వాటిలో నీటిని నిల్వ ఉంచకుండా, ఇంటి బయట కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా మునిసిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. లేదంటే నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా వృద్ధి చెందుతుందని అన్నారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో దోమల సంఖ్య పెరగకుండా నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గ్రహించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జ్వరం రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా వచ్చినచో నిర్లక్ష్యం చేయకుండా, రక్త పరీక్షలను చేయించుకుని వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. చికిత్స కు సంబంధించిన మందులు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులకు, అధికారులకు సూచించారు. మలేరియా కు సంబంధించినటువంటి మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈరోజున మనం మలేరియా డే, ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లో అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ అన్నారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా వాంతులు విరేచనాలతో అతిసార ప్రబలుతుందని ప్రజలు వేడి చేసిన నీటిని తాగాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా వంటగదిలలో పరిశుభ్రతను పాటించాలని దీనిపై వారిలో అవగాహనను పెంచాలని అధికారులకు సూచించారు. మలమూత్ర విసర్జనల అనంతరం చేతులను పరిశుభ్రపరచుకోవడం, ఆరుబయట మల మూత్ర విసర్జన చేయరాదని, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకుంటే డయేరియా నుండి దూరంగా ఉండవచ్చని తెలిపారు.
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలను తనిఖీ చేయమని అధికారులకు సూచించి ఒక దఫా తనిఖీలు చేపట్టడం జరిగిందనీ, విద్యార్థులు ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండ శుభ్రమైన ఆహారం, మంచినీరు సౌకర్యం కల్పించేలా తగు వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అనకా పల్లి నందు ఈ మధ్య జరిగిన ఘటన నేపథ్యంలో మరొక మారు అన్ని సంక్షేమ వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసి అనుమతి లేని కేంద్రాల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్యా రాణి, వైద్యాధికారులు ఆశా లు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.