Breaking News

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించాలి, తద్వారా మాత్రమే అజమాయిషీ చెలాయించే వారి నుండి విముక్తి లభిస్తుంది…

-ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై గత ఐదేళ్లుగా కొనసాగుతున్న వివక్ష ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందన్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా రోజు కూలీల మాదిరిగా ప్రతి పనికీ ఎడా పెడా వాడేస్తూ ఉద్యోగ వ్యవస్థలో చులకన చేస్తున్నారని, ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రతి సందర్భంలో చులకన చేసేలా పరిస్థితులు ఎదురవ్వడం బాధాకరం. గతంలో సులభ్ కంప్లెక్స్ ల వద్ద,పార్కుల వద్ద, రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారి వద్ద ఆశీలు వసూళ్ళ కోసం, చెత్త శుభ్రం చేయడం కోసం విధులు, చెత్త పన్ను వసూలు, అంగన్వాడీ సెంటర్ల విధులు వంటి సంభందం లేని అప్పగించి అవమానించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఈ నెల ఆగస్టు 16వ తేదీన పాఠశాల విద్యాశాఖ మధ్యాహ్న భోజన విభాగం తరపున విడుదల చేసిన ఆదేశాలలో,ప్రతి వారం రెండు రోజులు సోమ మరియు గురువారం సచివాలయాల పరిధిలో ఉన్న పాఠశాలలకు గ్రామ సచివాలయం పరిధిలో సంక్షేమ విద్యా సహాయకులు, వార్డు సచివాలయం పరిధిలో వార్డు విద్యాకార్యదర్శి పాఠశాల లకు వెళ్ళి ఐ.యం.యం.యస్ / సి.ఆర్ యాప్ నందు మరుగుదొడ్ల ఫోటోలు, వాష్ బేసిన్ల ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆదేశాలు జరీచేశారు. ఐతే ఇటీవల ఉపాధ్యాయులకు ఈ విధుల నుండి విముక్తి కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎంతో సంతోషించారాని,వారికి తొలగించిన విధులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నత విద్యావంతులైన సచివాలయ ఉద్యోగులకు గౌరవప్రదమైన విధులు అప్పగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని, ఉద్యోగులపై ఒకే శాఖ అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఐదు సంవత్సరాలనుండి క్షేత్ర స్థాయి అధికారులు కొంతమంది సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారని, ఈ వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. అసభ్య పదజాలం వాడడం,దూషించడం, కనీసం మనుషుల్లా చూడకుండా వేధించడం, కక్షపూరితంగా వ్యవహరించిన సంఘటనలు ఎన్నోవున్నాయని, ఉద్యోగులు సెలవుల కోసం కనీసం ముగ్గురు నుండి ఆరుగురు అధికారుల కాళ్ళు పట్టుకున్నా కనికరం చూపని పరిస్థితి కేవలం సచివాలయ ఉద్యోగులదేనని ఆవేదన చెందారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇరవై లక్షల మందితో పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని మాపై ఎందుకిలా వివక్ష చూపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఉపసంహరించుకోవాలని కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *