Breaking News

ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు…

-80 శాతం రాయితీపై విత్తనాలు అందించండి
-ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలివ్వండి
-రైతుకు అవసరమైన విత్తనాలకు రాయితీ ఇవ్వాలి
-ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించండి
-రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖా మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు రాయలసీమ లోని 8 జిల్లాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలకు, రైతులు కోరుకునే రకాల విత్తనాలు సిద్దం చేయడంతో పాటు అటువంటి విత్తనాలకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సాగుకు దూరంగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలివ్వాలని అధికారులకు తెలియచేశారు. ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించాలని, రైతులకు సాధారణ సాగులో ఆదాయం తగ్గకుండా ప్రత్యమ్నాయ పంటలను సూచించాలని మంత్రి  తెలిపారు.
ఇప్పటికే సాగులో ఉన్న పంట దిగుబడులు తగ్గకుండా తగు చర్యలు తీసుకోవలని సూచించారు. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం ఉన్నా సాగు మాత్రం తక్కువ విస్తీర్ణంలో నమోదు అవడం వలన స్వల్పకాలంలో దిగుబడి వచ్చే పంటలు ప్రోత్సహించాలని తెలిపారు. ఒకేసారి వర్షం అధికంగా పడడం, ఎక్కువగా డ్రై స్పెల్స్ నమోదు అవడం వలన సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు తెలిపారు.
రాయలసీమ జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన వర్షపాత వివరములు వివిధ పంటల సాగు విస్తీర్ణం, పంట సాగు చేయని మిగిలిన విస్తీర్ణం లో అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. రాయలసీమ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆయా జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్ర పరిస్థితులను మంత్రి అచ్చెన్నాయుడు కి, అధికారులకు వివరించారు. గత ఏడాది జూన్ మాసం నుండి ఇప్పటి వరకు నెలవారీగా వాస్తవ పంటల సాగు విస్తీర్ణము, వర్షపాతము వివరంచారు. వర్షం నమోదైన రోజులు తదితర పరిస్థితులను సాధారణ సాగు విస్తీర్ణము తదితర అంశముల తో బేరీజు చేస్తూ చర్చించారు.
డిల్లీ రావు IAS వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాల్లో 15,03,613 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం నకు గాను, ఇప్పటివరకు 11,24,351 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగుయిందని తెలుపుతూ, 3,79,262 హెక్టార్ల విస్తీర్ణంలో ఎటువంటి పంటలు సాగు చేపట్టక ఆ సాగు భూములు ప్రస్తుతం ఖాళీ గా నమోదైందని తెలిపారు. వాటి స్థానం లో ప్రత్యామ్నాయo గా 2,22,349 హెక్టార్ల అత్యధిక విస్తీర్ణంలో ఉలవలు మిగిలిన విస్తీర్ణంలో పెసర, అలసందలు, జొన్న, కొర్ర, మినుము ,సజ్జ పంటలను సిఫారసు చేసారని తెలిపారు. వీటిపై జిల్లా వ్యవసాయ అధికారులు 80 శాతం విత్తన రాయితీ ప్రతిపాదనలపై శివప్రసాద్ IFS మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వారు టెండర్ల ప్రక్రియ చివరి అంకము లో ఉన్నదని రానున్న రెండు రోజులలో సరఫరా ఏజెన్సీ లను నియమించి విత్తన పంపిణీ చేస్తామని తెలియచేశారు. జిల్లా వ్యవసాయ అధికారుల తో వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డా. పాలడుగుల సత్యనారాయణ మాట్లాడుతూ, పంటలు బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఈ చర్చ లో పాల్గొన్న అధికారులు తమ ప్రాంతం లోని రైతులు ఎక్కువ మంది నవధాన్యాల సాగు పై ఆసక్తి చూపుతున్నారని వాటిని కూడా పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమ చివరలో బుడితి రాజశేఖర్ IAS ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్య & సహకారం) వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తత తో ఉంటూ క్షేత్ర స్థాయి లో పంటలను పరిశీలిస్తూ రైతులకు ఎప్పటి కప్పుడు సూచనలను అందిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
సమీక్షలో బుడితి రాజశేఖర్ IAS ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్య & సహకారం), ఎస్. డిల్లిరావు IAS డైరెక్టర్ వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్, శివప్రసాద్ IFS మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వారు,  డా. పాలడుగు సత్యనారాయణ, వ్యవసాయ పరిశోధనా సంచాలకులు మరియు కమీషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *