విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జిఎం, కన్వీనర్ జివిఎన్. భాస్కరరావు అన్నారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆద్వర్యంలో మంగళవారం స్థానిక తుమ్మల పల్లి కళాక్షేతంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ జివిఎన్. భాస్కరరావు మాట్లాడుతూ సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తుల్లో పని చేసే వెనుకబడిన వర్గాల కోసం పీఎం విశ్వకర్మ పథకానికి రూ. 13 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ పథకం 2028 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన పథకాన్ని ప్రారంభించారన్నారు. చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారన్నారు. పనిలో నాణ్యతను మెరుగుపరచేందుకు దేశ వ్యాప్తంగా చేతి వృత్తిదారులకు రూ. 13 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం అందిచే విధంగా ప్రకటించిందన్నారు. గురు- శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సంప్రదాయ పని ముట్లను, చేతులను ఉపయోగించి పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే కాకుండా చేతి పనుల వారు, కాళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానించడం పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకంపై విస్తృత అవగాహన కల్పించి లబ్ది పొందేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జిఎం, కన్వీనర్ జివిఎన్. భాస్కరరావు అన్నారు.
విశ్వకర్మ యోజన పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా స్టాల్స్ ను ఏర్పాటు చేసారు. వర్క్ షాప్ లో విశ్వకర్మ యోజన లబ్దిదారులకు చెక్కులను అందించారు.
వర్క్ షాప్ లో ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ రామలింగేశ్వర రాజు, కె వి ఐ సి స్టేట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ గ్రూప్, ఎడిషనల్ డైరెక్టర్ మౌళి, జిఎం ఇండస్ట్రీస్ సుధాకర్, యు బి ఐ జనరల్ మేనేజర్ సి వి ఎన్ భాస్కరరావు, ఎస్ ఎల్ బి సి కోఆర్డినేటర్ ఈ రాజు బాబు, శ్రీనివాస్ దాస్యం పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, బ్యాంక్ ప్రతినిధులు, ఖాతాదారులు పాల్గొన్నారు.