Breaking News

రీ సర్వేలో రికార్డులు తారుమారయ్యాయి

-బ్యాంకు రుణం ఉన్న రికార్డులు ఎలా మారుతాయి?
-రీ సర్వే అక్రమాలపై జనసేన జనవాణికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు
-మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘తాతల కాలం నుంచి ఉన్న భూమిలో ఉన్న పళంగా సగం మాయం అయ్యింది. రికార్డులు తారుమారయ్యాయి. సర్వే చేయమంటే అధికారులు సగం భూమికే సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో నా భూమి పోయింది. పూర్వపు రికార్డుల ప్రకారం నా భూమి నాకు ఇప్పించండి’ జనసేన కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో ఓ బాధితుడి ఆవేదన ఇది. జగనన్న భూ సురక్ష చట్టానికి తారుమారైన భూ రికార్డులతో ఇబ్బందులు పడుతున్న బాధితులు పదుల సంఖ్యలో వినతులతో వస్తున్నారు. బుధవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అవసరం ఉన్న చోట ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడి బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
• నాకు 1.68 ఎకరాల భూమి తండ్రి నుంచి సంక్రమించింది. మా భూమి మీద ఎప్పటి నుంచో బ్యాంకులో రుణం కూడా పొంది ఉన్నాము. అవసరార్ధం ఇటీవల బీ1 కాపీ తీసుకుంటే నా పేరిట 0.84 సెంట్ల భూమి మాత్రమే ఉన్నట్టు చూపిస్తోంది. సర్వే కోరినా అంతే భూమికి చేస్తున్నారు. గతంలో ఉన్న రికార్డులు రీ సర్వే తర్వాత మారిపోయింది. నా భూమి మొత్తం నాకు అప్పగించే ఏర్పాటు చేయాలని చిత్తూరు జిల్లా, మొదవాడ గ్రామానికి చెందిన చావలి యుగంధర్ జనసేన కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. జనవాణి ద్వారా ఫిర్యాదు స్వీకరించిన మండలి బుద్దప్రసాద్  చిత్తూరు ఆర్డీఓతో మాట్లాడి బాధితుడి సమస్య పరిష్కరించాలని సూచించారు.
• రైల్వే లైన్ నిర్మాణం నిమిత్తం 2020లో నాకు చెందిన 0.94 సెంట్ల భూమిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని పల్నాడు జిల్లా, మెక్కెళ్లపాడుకు చెందిన మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
• పెనమలూరు నియోజకవర్గం, పోరంకికి చెందిన శేషుమణి అనే మహిళ తన భూమిని ఓ బిల్డర్ అక్రమంగా ఆక్రమించి బెదిరిస్తున్నాడంటూ జనవాణిలో వినతి పత్రం సమర్పించింది.
• 108 వాహనాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న డ్రైవర్లు తమకు సర్వీస్ రూల్స్ అమలయ్యేలా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని 108 సర్వీస్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ఆడబిడ్డల మిస్సింగ్ కేసులు, గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో పోలీసుల వేధింపులకు గురైనవారు, పింఛన్ల కోసం పలువురు లబ్దిదారులు జనవాణిలో అర్జీలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సుందరరామిరెడ్డి, బర్మా ఫణిబాబు, తిరుపతి అనూష, ఎన్.శ్రీనివాస రావు, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *