Breaking News

యువతరం శాస్త్ర సాంకేతికతను, విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

-గూడూరు శాసన సభ్యులు డా. పాశిం సునీల్ కుమార్ ఆకాంక్ష
-జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అంతరిక్ష విశేషాల ఎగ్జిబిషన్ ప్రారంభం
-గూడులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో మూడు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక ఎగ్జిబిషన్

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యువతరం శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి ఎదగాలని గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశిం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం, నెల్లూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతరిక్ష విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అంతరిక్ష దినోత్సవం జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని గూడూరును భారత ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ కోసం ఎంపిక చేయటం ఆనందదాయకమని తెలిపారు. ఇదే స్ఫూర్తితో యువతరం చైతన్యవంతం కావాలని, సమాజంలో ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్న మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పని చేయాలని సూచించారు.

కార్యక్రమానికి విచ్చేసిన షార్ పూర్వ శాస్త్రవేత్త శ్రీ విశ్వనాథ శర్మ గారు మాట్లాడుతూ ఒకప్పుడు విదేశాల సహకారంతో అంతరిక్ష ప్రయోగాలు చేసే స్థాయి నుంచి, ఇప్పుడు విదేశాలకు సహకారం అందించే స్థాయికి అంతరిక్ష రంగంలో భారత్ ఎదిగిందని, ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంలో విస్తృత అవకాశాలను యువత వినియోగించుకోవాలని సూచించారు.

భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి మాట్లాడూ, చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైన ఆగస్టు 23ను భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమని, మొదటి కార్యక్రమాన్ని చారిత్రక విశేషం ఉన్న గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించటం ఆనందదాయకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులకు అంతరిక్ష విశేషాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గౌరవ శాసనసభ్యులు బహుమతి ప్రదానం చేశారు. ప్రభుత్వం తరుఫున శ్రీ విశ్వనాథ శర్మ గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి మాధవి, డి.ఆర్.డబ్ల్యూ కళాశాల కార్యదర్శి శ్రీమతి మెహర్ మణి, కోశాధికారి శ్రీ విద్యాసాగర్ సహా గూడూరుకు చెందిన పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *