Breaking News

అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన పేలుడులో కార్మికులు మరణించిన కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ
-కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉందేమో కనిపెట్టడానికి సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశం
-ఎఫ్‌ఐఆర్, క్షతగాత్రుల ఆరోగ్యం & వైద్య చికిత్స, చనిపోయిన & గాయపడిన వారి కుటుంబాలకు పరిహారం పంపిణీ పరిస్థితిని కూడా తెలియజేయాలని నిర్దేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లాలో ఉన్న అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి 17 మంది కార్మికులు మరణించారని, మరో 50 మంది గాయపడ్డారని మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 21న ఈ కేసును స్వయంగా విచారణకు తీసుకుంది. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు వెతుకుతున్నట్లు సమాచారం. శిథిలాల కింద కొన్ని మృతదేహాలు చిక్కుకుపోయి ఉంటాయని, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో ఎంత మంది కార్మికులు విధుల్లో ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.

సంబంధిత అధికార్ల నిర్లక్ష్యం కారణంగా బాధితుల ‘జీవించే హక్కు’ ఉల్లంఘనకు గురైనట్లు మీడియా వార్తల్లోని అంశాలు సూచిస్తున్నాయని జాతీయ కమిషన్ గుర్తించింది. అన్ని భద్రత నియమాలు & చట్టపరమైన నిబంధనలను పరిశ్రమ యజమాన్యం ఖచ్చితంగా పాటించిందా?, సంబంధిత అధికార్లు పర్యవేక్షిస్తున్నారా, లేదా? అని తనిఖీ చేసేందుకు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణాత్మక నివేదికను సమర్పించాలని నిర్దేశించింది.

ఎఫ్‌ఐఆర్ స్థితి, గాయపడిన వారి ఆరోగ్యం & వైద్య చికిత్స, నష్టపరిహారం పంపిణీ, గాయపడిన వారికి & చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అందించిన ఇతర ఉపశమనాలపై తాజా సమాచారం అందించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచించింది. దుర్ఘటనకు బాధ్యులైన అధికార్లపై తీసుకున్న చర్యల గురించిన సమాచారాన్ని కూడా జాతీయ కమిషన్ అడిగింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *