Breaking News

ఘనంగా జాతీయ అంతరిక్ష వారోత్సవాలు

– భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులచే అంతరిక్ష వారోత్సవ ర్యాలీ
– దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల వేదికగా అంతరిక్ష విశేషాల ఎగ్జిబిషన్
– రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు

గూడూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రయాన్ -3 విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమం గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఘనంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతరిక్ష విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ కు మంచి స్పందన వస్తోంది. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా డి.ఆర్.డబ్ల్యూ కళాశాల విద్యార్థినులచే ప్రత్యేక అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మన ఆలోచనలే మన విజయాలకు మెట్లుగా నిలుస్తాయని, ఈ నేపథ్యంలో చంద్రయాన్ – 2, చంద్రయాన్ -3లను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. చంద్రయాన్ -2 ల్యాండింగ్ లో వచ్చిన సమస్యలకు కుంగిపోకుండా, అలాంటి సమస్యలను అధిగమించే నూతన ఆలోచనలతో చంద్రయాన్ -3 ఘనవిజయం సాధించామని జీవితం కూడా అలాంటిదే అని పేర్కొన్నారు. మన ఆసక్తులే మన భవిష్యత్తును శాసిస్తాయన్న ఆయన, చదువుతో పాటు సమకాలీన విషయాలు తెలుసుకోవాలని సూచించారు. విద్య అంటే మార్కులు, ర్యాంకులు కాదని, జ్ఞానమే నిజమైన విద్య అని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి మాట్లాడుతూ, మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాచారాన్ని విద్యార్థులు వినియోగించుకుని భవిష్యత్ లో ఉన్నత స్థాయి ఎదగాలని సూచించారు.

జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024 ఆగస్టు 23న భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతరిక్ష విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ ను గూడూరు శాసన సభ్యులు శ్రీ సునీల్ కుమార్ ప్రారంభించారు. రెండు రోజుల్లో గూడూరులోని 20 పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ ను తిలకించారు. కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సెల్పీ బోర్డు వద్ద ఫోటోలు దిగేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం వరకూ జరగనున్న ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

రెండో రోజు కార్యక్రమంలో షార్ పూర్వ శాస్త్రవేత్త విశ్వనాథ శర్మ, సి.డబ్ల్యూ.సి. చైరపర్సన్ మాధవి, డి.ఈ.వో. శాంతి, సి.డి.పి.ఓ.  మెహబూబీ, డి.ఆర్.డబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, డి.ఆర్.డబ్ల్యూ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్. సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *