Breaking News

మనం ఎక్కడున్నా తెలుగు భాషా, సంస్కృతిని కాపాడుకోవాలి

-మహారాష్ట్ర థానే లో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ – తెలుగు సభలో పాల్గొన్న..
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

థానే, నేటి పత్రిక ప్రజావార్త :
అమ్మలాంటి మాతృ భాష తెలుగు యొక్క ఔనత్యాన్ని భావితరాలకు తెలియచేయాలనే సంకల్పంతో థానేలో వున్న తెలుగువారంతా  కలిసి తెలుగు మహాసభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో థానే నగరంలోని డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ ఏసీ ఆడిటోరియంలో తెలుగు మహాసభను అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉద్యోగ,వ్యాపార, పరిశ్రమల ఏర్పాటు కోసం మహారాష్ట్రకు వలస వెళ్లిన తెలుగువారు ప్రతి ఏటా ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ తరపున తెలుగు మహాసభలు ఆనవాయితీగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కవి, ప్రముఖ సాహిత్య వేత్త, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత మంత్రి కందుల దుర్గేష్ కు, జొన్నవిత్తులకు మహారాష్ర్ట థానే తెలుగు అసోసియేషన్ చైర్మన్ రమణ, అధ్యక్షులు జగన్ బాబు, విద్యాసంస్థలు అధినేత ఎ.వి.గుప్తా, గురవరెడ్డి, సత్యమూర్తి తదితరులు పూర్ణకుంభంతో అఖండ స్వాగతం పలికారు. ముందుగా సభలో తెలుగుదనం ఉట్టిపడేలా కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మహారాష్ట్ర లోని థానే ప్రాంతంలో తెలుగు అసోసియేషన్ వారు అంతా కలిసి ఏర్పాటు చేసిన తెలుగు సభలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా వుందన్నారు. అమ్మలాంటి మాతృ భాష తెలుగు భాష ను కాపాడుకునేందుకు, దాని ఔనత్యాన్ని భావితరాలకు తెలియజేసేందుకు ఇక్కడ తెలుగువారంతా కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం అని దుర్గేష్ అన్నారు. మనం ఎక్కడున్నా తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకూడదన్నారు. మన భాష ఎంతో మధురమైనదని, దేశభాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నారు. అందరం కలిసి ఐకమత్యంగా ఆర్థికంగా ఎదగాలని, ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉండాలని మహారాష్ట్ర థానేలో తెలుగు ఫెడరేషన్ పెట్టుకోవడం , ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. మీరంతా వ్యాపార, ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చిన మనప్రాంతాన్ని మన సంసృతిని, మన భాషను మరిచిపోకుండా వాటి ఔనత్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి తెలుగు సభల్లో పాల్గొనడం గొప్పకాదని, ఇలా ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు తమ మాతృ భాషను కాపాడుకునేందుకు, అందులో ఉన్న మమకారాన్ని ఆస్వాదించేందుకు చేస్తున్న ఇలాంటి సభల్లో తాను పాల్గొనడం మహాభాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలుగు భాషాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగువారి కోసం ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా తమ కూటమి ప్రభుత్వం అందిస్తామని, ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి ఇతోధిక ప్రోత్సహం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు . సుదీర్ఘ కాలంపాటు తెలుగుప్రజల కోసం, తెలుగుభాషాభివృద్ధి కోసం ఇలాంటి సభలు నిర్వహించి కృషి చేస్తున్న తెలుగు అసోసియేషన్ నిర్వాహకులు పివీ రమణ, గంజి జగన్ బాబుకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలపడమే కాకుండా తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగువాడి నాడి నలుదిశలా సాటిచెపుతున్న ప్రముఖ సాహిత్యవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సభలో మాట్లాడారు. సభకు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన
తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ బ్యానర్ ను మంత్రి కందులు దుర్గేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ను, జొన్నవిత్తులను ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర నిర్వాకులు ఘనంగా సత్కరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *