Breaking News

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పచ్చదనం పెంపొందించాలని, భావితరాలను కాపాడాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హైనీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటి, మొక్కలు పంపిణీ చేశారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని సభికులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవాళికి ప్రాణవాయువు అందించే మొక్కల పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆధునిక ప్రపంచంలో చెట్లు నరకడం, అడవులు తగ్గిపోవడం కారణంగా తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎంతో నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 26% గా ఉన్న పచ్చదనం 50% కు పెంచాలని ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు. కృష్ణాజిల్లాలో 9.8% అడవుల విస్తీర్ణం ఉందన్నారు. దీనిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఇతర ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పచ్చదనం పెంపునకు సహకారం అందిస్తున్నదని అన్నారు. అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్రీ అభివృద్ధికి పట్టణాల్లో పార్కులు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి గ్రీన్ టాప్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కేరళలో వరదలు సంభవించాయని, అడవులు తగ్గిపోవడం కారణాలుగా విశ్లేషించారని తెలిపారు. సముద్ర తీరం వెంబడి మడ అడవులు భూమి కోత అరికడతాయని, కావున వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

చెట్ల గొప్పతనం తెలుసుకొని ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లో మొక్కలు నాటాలని ఈ విషయం విద్యార్థులకు అవగాహన కల్పించాలని, భావితరాలను కాపాడాలని సూచించారు. 20 ఏళ్ళ క్రితమే ఎంతో దూరదృష్టితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పచ్చదనం- పరిశుభ్రం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం మంత్రి గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నియోజకవర్గంలో 40 వేల మొక్కలు నాటాలని బండి రామకృష్ణ కృషి చేస్తున్నారని అన్నారు. తొలుత జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో బందరు ఆర్డిఓ ఎం. వాణి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, గొర్రిపాటి గోపీచంద్, బాబా ప్రసాద్, కుంచె దుర్గాప్రసాద్, లంకె నారాయణ ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, ఎంఈఓ దుర్గాప్రసాద్, తాసిల్దార్ శ్రీనివాస్, హైని స్కూల్ యాజమాన్య ప్రతినిధులు జాషువా ప్రసన్నకుమార్, ఎల్. మోజస్, వైటి గ్లోరీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *