Breaking News

తెలుగు భాషోద్యమవేత్త వెంకయ్య నాయుడు

-కలమళ్ల గ్రామాన్ని ఆయన సందర్శించడం మహాభాగ్యం
-ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
-తెలుగు భాషా పండితులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు స్ఫూర్తిదాయకమైన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుండ్ల మండలం కలమళ్ల గ్రామాన్ని తెలుగు భాషోద్యమవేత్త, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సందర్శించడంతో మహా ప్రాచుర్యంలోకి వచ్చినట్లయిందని తెలుగు భాషా పండితులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు అన్నారు. క్రీ.శ.575లోనే రేనాటి చోళరాజ వంశానికి చెందిన ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు తెలుగు శాసనాన్ని వేయించటమే కాకుండా తెలుగును అధికార భాషగా అమలు చేశారని ఆయన గుర్తుచేశారు. విద్యార్థి దశ నుంచే వెంకయ్య నాయుడు మాతృభాష తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ, తెలుగు అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరు స్వర్ణ భారతి ట్రస్ట్ కు తరలింపజేశారని నిమ్మరాజు ప్రస్తుతించారు.
ప్రాచీన శాసన ఆధారాలతో “తెలుగు భాషకు ఆద్యులు – తెనుగోళ్ళు” పేరిట తొలి తెలుగు శాసనం ఏర్పాటు పూర్వాపరాలపై “తొలి తెలుగు దివ్వె” సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పి.వి.ఎల్.ఎన్.రాజు (అబ్బు), అధ్యక్షురాలు శ్రీమతి పిల్లి లక్ష్మీతులసి రాసిన గ్రంథాన్ని ఏడాది క్రితం వెంకయ్య నాయుడును కలిసి అందజేసి, ఆ గ్రామ ప్రాశస్త్యాన్ని వివరించడం జరిగిందన్నారు.
శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో ఐదేళ్ల పాటు భాషా ప్రవీణ, ఆపై పండిట్ శిక్షణ పొందిన తనకు తెలుగు భాష పట్ల అపార గౌరవం వుందని నిమ్మరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాధారణంగా నేడు తెలుగు భాష అంటే రాజరాజ నరేంద్రుడు, ఆదికవి నన్నయ్య (11వ శతాబ్ది), నన్నెచోడుడు (12వ శతాబ్ది), శ్రీనాథుడు (13వ శతాబ్ది), శ్రీకృష్ణదేవరాయలు (16వ శతాబ్ది), గిడుగు రామమూర్తి పంతులు (20వ శతాబ్ది) గుర్తుకు వస్తారని నిమ్మరాజు వివరించారు.
తొట్టతొలి తెలుగు శాసనాన్ని గుర్తించిన భారత పురాతత్వ సర్వేక్షణ (ఎపిగ్రాఫి) శాఖ వారికి, పరిశోధకులకు, చరిత్రకారులకు, సంరక్షణ చేపట్టిన కలమల్ల కాపురస్తులకు అక్కడే తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కడప జిల్లా కలెక్టర్ సంకల్పించడం, మాజీ ఉప రాష్ట్రపతి ని ఆహ్వానించడం, వైభవంగా, వేడుకగా కలమల్ల తెలుగు శాసనం ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటటడం నిజంగా అబ్బురమైనదన్నారు. నభూతో నభవిష్యతి అయినది కలెక్టర్ కే సుసాధ్యమైనదని పేర్కొన్నారు. కలెక్టర్ గారికి కలమల్ల సాక్షిగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, నమస్సుమాంజలులు తెలిపారు. ఎందరో మహానుభావులు ఈ తెలుగు భాషా యజ్ఞంలో పాల్గొన్నారనీ, వారందరికీ హృదయపూర్వక శుభాభినందనలు, నీరాజనాలు తెలుపుతూ, ఇందుకు సహకరించిన ఇంటాక్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *