Breaking News

50 మంది కాపరులు, 3501 జీవాలను కాపాడిన అధికార యంత్రాంగం

-ప్రాణాల మీదకు తెచ్చిన బ్రతుకుతెరువు
-నెలల తరబడి లంకల్లో జీవాలను మేపుకునే కాపరులు
-రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లంకలు ముంపుకు గురయ్యే పరిస్థితి
-బిక్కుబిక్కుమంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చెరవేత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి, వైకుంఠపురం, గిడుగు, పొందుగల, మునుగోడు. పల్నాడు జిల్లా, అమరావతి మండలంలో కృష్ణా నది ఒడ్డున ఈ గ్రామాల లంకలు పచ్చని బయల్లకు ప్రసిద్ధి. బోట్లలో వందల సంఖ్యలో లంకల్లోకి జీవాలను తోలుకు వెళ్లి నెలల తరబడి అక్కడే నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగించే కుటుంబాలకు ఆ గ్రామాలు నెలవుగా మారాయి. బ్రతుకుదెరువులో భాగమైన ఆ అలవాటే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. 20 రోజుల కిందట ఈ గ్రామాలకు చెందిన 36 మంది 1500 జీవాలను తోలుకుని లంకలకు చేరి అక్కడే వంటా వార్పు చేసుకుంటూ గడుపుతున్నారు. అయితే రెండు రోజుల ఎడతెరిపిలేని వర్షాలతో క్రమ క్రమంగా నీటి మట్టం పెరిగింది. 7 లక్షల క్యూసెక్కుల నుంచి 8 లక్షల క్యూసెక్కుల స్థాయికి నీరు చేరింది. మరో రెండు రోజులు వర్షాలు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో వారిలో భయం మొదలైంది. అచ్చంపేట మండలం కొనూరు, కస్టాల, చామర్రు గ్రామాలకు చెందిన 14 మంది కాపరులు, 2001 జీవాలది కూడా ఇదే పరిస్థితి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావు, పెదకూర పాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు రంగంలోకి దిగారు. స్థానికంగా అమరావతి బోట్ సెంటర్, అచ్చంపేట కష్టాల మరియు కృష్ణా జిల్లా గనత్ పూర్ బోట్ సెంటర్ల నుంచి 22 బోట్లను సమీకరించారు. ఒక్కోసారి 30 నుంచి 50 జీవాలను మాత్రమే తీసుకు రాగలిగే అవకాశం ఉండగా ఒక బోటు ఇటు వెళ్లి అటు రావడానికి కనీసం 2 గంటలు పడుతుంది. జీవాలను బోటులో ఎక్కించే సమయం, ప్రయాస అదనం. సగటున ఒక్కో బోటును 4 ట్రిప్పులు నడిపి, 10 గంటలకు పైగా పర్యవేక్షిస్తూ అందరినీ సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకురావడం జరిగింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *