Breaking News

కడుపు నింపుతూ… బతుకుపై బెంగ తీరుస్తూ…

-54, 55, 56 డివిజన్లలో మంత్రి సవితమ్మ పర్యటన తీరు
-మోకాలు లోతు నీటిలో మూడు డివిజన్లలో ఇంటింటికీ వెళ్లిన మంత్రి
-ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్ల పంపిణీ
-చంద్రబాబు ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని స్పష్టం
-తక్షణమే సమీపంలో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచన
-మంత్రి భరోసాతో వరద బాధితుల్లో ఆనందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోటి ఆశలతో అల్లుకున్న బతుకులను కృష్ణమ్మ తనలో కలుపుకుంది… భవిష్యత్తు కోసం గంపెడాశలతో కంటున్న బంగారు కలలను కల్లలు చేసింది. సర్వం కోల్పోయి వరద నీటిలో నిస్సహాయంగా ఉన్న ఆ నిరాశ్రయుల్లో ఆ గొంతు భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచింది. అందించిన ఆ అపన్నహస్తం వరద బాధితుల్లో కోటి ఆశలు నింపింది. మూడ్రోజుల నుంచి అన్న పానీయాలు లభించక నీరసించిన బాధితుల్లో ఆనందాన్ని నింపింది. ఇదీ విజయవాడ నగరంలో 54, 55, 56 డివిజన్లలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవితమ్మ పర్యటనతో ఆయా ప్రాంతాలు ఆవిష్కృతమైన దృశ్యాలు. కృష్ణా నది వరదల నేపథ్యంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాధితుల్లో భరోసా నింపుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిస్సహాయులకు మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో మంత్రులకు నగరంలోని పలు డివిజన్లను సీఎం చంద్రబాబునాయుడు కేటాయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవితమ్మకు నగరంలో 54, 55, 56 డివిజన్లను అప్పగించారు. ఆయా డివిజన్లలో బాధితులకు ప్రభుత్వ సేవలను అందిస్తూ, వారిలో భవిష్యత్తుపై భయాందోళనలను తొలగించి, మేమున్నామనే భరోసా ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సవితమ్మ తనకు అప్పగించిన డివిజన్లలో సుడిగాలి పర్యటన చేశారు. మోకాలు లోతు వరద నీటిలో తిరుగుతూ మూడు డివిజన్ల ప్రజలను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉందని, ఎవ్వరూ దిగాలు చెందాల్సిన పనిలేదని మంత్రి తెలుపుతూ…భుజం తడుతూ వారిలో నిస్సహాయతను, నిరుత్సాహాన్ని పారదోలారు.

మోకాలులోతు నీటిలో ఇంటింటికీ వెళ్లి పరామర్శ…
మంత్రి సవితమ్మ తొలుత 54 డివిజన్ లో పర్యటించారు. ఎన్ని వాహనాలతో ఆహార పదార్థాలు వచ్చాయి… వాటర్ బాటిళ్లు కేసుల ఎన్ని వచ్చాయని ఆ డివిజన్ కు స్పెషాలాఫీసుర్ సేదు మాధవన్ ను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలు అనుకున్న సమయానికి ప్రతి ఇంటికీ చేరాలని మంత్రి స్పష్టంచేశారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకలు ఫతుల్లా అహ్మద్ తో కలిసి టీఎస్పీ స్ట్రీట్, గాంధీ బొమ్మ సెంటర్, లక్ష్మయ్య స్ట్రీట్, ఈఫెన్ స్ట్రీట్ లో ఉన్న మోకాలు లోతు నీటిలో ఇంటింటికీ వెళ్లారు. ప్రభుతం అందజేసిన పాలు, ఆహారం, వాటర్ బాటిళ్లను మంత్రి పంపిణీ చేశారు. ఏమైనా అవసరాలు చెప్పాలని ప్రతి ఇంటి దగ్గరా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి తరలివెళ్లాలని వరద బాధితులకు సూచించారు. భయపడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు పంపించారని, మీ కష్టాలు తీర్చడానికి తానొచ్చానంటూ వారిలో భరోసా నింపారు. రోడ్లపై నీరు నిలబడకుండా కాలువల్లో పూడికలు తొలగించాలని ఆ డివిజన్ పారిశుద్ధ్య సిబ్బందిని మంత్రి ఆదేశించారు. భోజనం, పాలు, నీరు కొరత నీయ్యకుండా చర్యలు తీసుకోవాలని డివిజన్ స్పెషాలాఫీసర్ సేదు మాధవన్ కు మంత్రి సవిత స్పష్టంచేశారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం 55 డివిజన్ లోని సీఎస్ఐ చర్చి సెంటర్, నైజాం గేట్, అప్పలస్వామి స్ట్రీట్, అంబ్కేదర్ స్ట్రీట్ లోనూ మంత్రి పర్యటించారు. అపార్టుమెంట్ల ఉన్నవారితో మైక్ సెట్ లో మాట్లాడారు. పాలు, ఆహారం, నీరు అందాయా..? అని వారిని అడిగారు. అందరకూ అందాయని స్థానికులు తెలపడంతో మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం ఓల్డ్ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ల పంపిణీకి మూడు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. వాటిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓల్డ్ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులను సేవలను కొనియాడారు. ఫతుల్లా అహ్మద్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.

దివ్యాంగులకు అండగా…
55 డివిజన్ సీఎస్ఐ సెంటర్లో నిస్సహాయులుగా నిల్చొన్న ముగ్గురు దివ్యాంగులను(అంధులు) గుర్తించిన మంత్రి సవిత వారిని పలుకరించారు. తమకు తక్షణమే ఆహారం, తాగునీరు కావాలని కోరగా, మంత్రి స్వయంగా వారికి అందించారు. వారిని సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి ఆటోలో తరలించాలని స్పెషలాఫీసర్ సాధు మాధవన్ ను మంత్రి ఆదేశించారు. దీంతో అక్కడున్న అధికారులు…వివ్యాంగులను తరలించారు.

బుడమేరు బాధితుల్లో భరోసా
అక్కడి నుంచి బుడమేరు కాలువ వల్ల నీటముగిని 56 డివిజన్ లో ఉన్న పాత రాజరాజశ్వేరి పేట లో మంత్రి సవిత పర్యటించారు. ఆ ప్రాంత స్పెషలాఫీసర్ రామసుందర్ రెడ్డితో కలిసి ముంపు ప్రాంతాల్లో పవర్ బోటు ద్వారా ఇంటింటికీ వెళ్లారు. నాలుగు గంటలకు పైగా ఓల్డ్ రాజరాజశ్వేరి పేటలో చివరి ఇంటి వరకూ వెళ్లి…ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లను మంత్రి స్వయంగా అందజేశారు. సీఎం చంద్రబాబు అండగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా ఆదుకుంటారని బాధితులకు తెలిపారు. వరద నీటిలో ఉండడం శ్రేయస్కరం కాదని, తక్షణమే సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి తరలివెళ్లాలని మంత్రి సవిత కోరారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్, టీడీపీ నాయకులు షేక్ ఆషా, తాజద్దీన్, సయ్యిద్ సలీం తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *