Breaking News

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

-ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. భారీ వర్షాలు, వరద నష్టంపై అంచనా..
-ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష..
-ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ను పరిశీలించిన కేంద్ర బృందం..
-ప్రకాశం బ్యారేజీ – దెబ్బతిన్న గేట్లను పరిశీలించిన బృందం..
-బుడమేరు గండ్లను పూడ్చే పనులను పరిశీలించిన కేంద్ర బృందం..
-వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై ప్రయాణించి ప్రభుత్వ సహాయక చర్యలను స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం..
-పరిస్థితులు, నష్టాలను కేంద్రానికి నివేదించి తక్షణ సాయం అందించేందుకు చర్యలు..
-రాష్ట్రానికి రానున్న ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ బృందం..
-కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం ఏపీలో పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి సంభవించిన పరిస్థితులను, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించింది. వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా అందించి రాష్ట్రానికి తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోనుంది.

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో సమీక్ష:
మొదటగా.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయ పునరావాస చర్యలను రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, జలవనరుల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావు వారికి వివరించారు. అనంతరం.. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ను కేంద్ర బృందం పరిశీలించింది.

ప్రకాశం బ్యారేజీ-దెబ్బతిన్న గేట్ల పరిశీలన:
అనంతరం.. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా.. బ్యారేజీ ప్రవాహం, ఇతర వివరాలను కేంద్ర బృందానికి రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, జలవనరుల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావు వారికి వివరించారు.

బుడమేరు గండ్లను పూడ్చే పనుల పరిశీలన:
ఆ తర్వాత.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్‌ – కవులూరు వద్ద బుడమేరుకు పడిన గండ్లను, గండ్లను పూడ్చే పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై పర్యటన:
అనంతరం.. భారీ వర్షాలు, వరదల ధాటికి నీట మునిగిన రామవరప్పాడు రింగ్ రోడ్డుతో పాటు కండ్రిక, పైపుల రోడ్డు, విశాలాంధ్ర కాలనీ, రాధా నగర్, పాత రాజీవ్ నగర్, కట్టరోడ్, సుందరయ్య నగర్, వడ్డెర కాలనీ, అంబాపురం 16వ లైన్, అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, ఎల్.బి.ఎస్. నగర్, న్యూ అజిత్ సింగ్ నగర్, పాయకపురం చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్ పై కేంద్ర బృందం ప్రయాణించింది. వరద ధాటికి నీట మునిగిన కాలనీలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను స్వయంగా పరిశీలించింది.
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీ ఆర్.పి. సిసోడియా కేంద్ర బృందం వెంట ట్రాక్టర్ పై ప్రయాణించి వారికి ముంపు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ సహాయక చర్యలను స్వయంగా వివరించారు.
ఈ సందర్భంగా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి 10వ బెటాలియన్ కమాండెంట్ వి.వి.ఎన్. ప్రసన్న సహాయక చర్యల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సలహాదారు (ఆపరేషన్స్&కమ్యూనికేషన్) కల్నల్ కెపి. సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ (సీడబ్ల్యూసీ) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం ఎస్ఈ (సీడబ్ల్యూసీ-కృష్ణా సర్కిల్) యం. రమేశ్ కుమార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) డైరెక్టర్ ఆర్. గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వి.వి.యన్ ప్రసన్న, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *