Breaking News

ఏలేరు వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలి

-ఎప్పటికప్పుడు ప్రవాహానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి
-నిత్యావసరాలను అందుబాటులో ఉంచండి
-ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ఏలేరు రిజర్వేయర్ కు పై నుంచి వస్తున్న వరదపై జిల్లా పాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం నిశితంగా పరిశీలిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులోని ముంపు కాలనీని స్వయంగా పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ ఆదివారం రాత్రి నుంచి కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఆయన, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిస్థితిని వివరించారు. ఏలేరు రిజర్వాయర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ప్రవాహంపై ఆరా తీశారు. ప్రస్తుతం రిజర్వాయర్ పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ ‘‘ ఏలేరు రిజర్వాయర్ పరిధిలోని గొర్రికండి, కోలంక, గొల్లప్రోలు గ్రామాలలకు ప్రాజెక్టు అవుట్ ఫ్లో 10 వేల క్యూసెక్యుల ప్రవాహం దాటితే ఇబ్బంది కలుగుతుంది. సుద్దగడ్డ అధిక ప్రవాహం తోడు కావడంతో గొల్లప్రోలులోని సూరంపేట వైపు కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నియోజకవర్గం పరిధిలో లక్ష్మీపురం, సీతానగరం, మల్లవరం, రమణక్కపేట, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయా ముంపు బాధితులకు అవసరం అయ్యే పునరావాస కేంద్రాలు, అలాగే సహాయక చర్యలు, నిత్యావసరాలు సిద్ధంగా ఉంచాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి నియోజకవర్గంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నా. అయితే పైనుంచి వర్షాలు అధికం అయితే ప్రాజెక్టులోకి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో నిరంతరం పర్యవేక్షణ జరిపేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి” అన్నారు.

నిత్యావసరాలు నిల్వలు
ఈ క్రమంలో నిత్యావసరాలు నిల్వలను అధికారులు వివరించారు. 2124 మెట్రిక్ టన్నుల బియ్యం, 202 మెట్రిక్ టన్నుల పంచదార, పామాయిల్ లీటర్, అర లీటర్ ప్యాకెట్లు 24 వేల ప్యాకెట్లు సిద్ధంగా ఉంచామన్నారు. విద్యుత్ అధికారులు సైతం ఎవరూ సెలవులు పెట్టకుండా విధుల్లో ఉండేలా, ఎక్కడ విద్యుత్ సరఫరా అంతరాయం వచ్చినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నాము. తాగు నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్లోరినేషన్ పూర్తిస్థాయిలో చేసిన తర్వాత గ్రామాల్లో రక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు. ఆర్మీ సిబ్బంది, ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఫైర్ సర్వీస్, పోలీస్ సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని తెలిపారు. నిరంతరం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారనీ, గర్భిణులు, బాలింతలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *