Breaking News

రైతులను, వరద బాధితులను ఆదుకోవాలి

-సియంకు రైతు సంఘాలు వినతి
-అన్నివిధాల ఆదుకుంటామని హామీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులను ఆదుకోవడానికి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఏపి రైతుసంఘాల సమన్వయసమితి నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గత పది రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల రైతాంగానికి నష్టం జరిగిందని, ఈ నష్టం నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ లో తీసుకున్న పంటరుణాలన్నిటిని రద్దుచేసి రైతాంగానికి అండగా నిలబడాలని కోరింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని విజయవాడ కలెక్టర్ ఆఫీస్ నందు కలిసి భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజల, రైతుల సమస్యలను వివరించి వాళ్ళను ఆదుకోవాలని విన్నవించింది. 19 జిల్లాలలో 5 లక్షల ఎకరాల్లో పైగా ఆహార, వాణిజ్య, ఉద్యానవన, కూరగాయల పంటలన్నీ దెబ్బతిన్నాయని, ఆర్థికంగా రైతాంగాన్నింకి నష్టం జరిగిందని, ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగం తీసుకున్న పంట రుణాలన్నిటిని రద్దు చేయాలని, కౌలురైతులకు ఆర్థిక సహకారం అందించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. మరల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉన్న అవకాశాలని ఉపయోగించాలని విన్నవించారు. నీట మునిగిన అన్ని పంటలను ఇన్యూమరేషన్ చేసి పంటల పరిహారం చెల్లించాలని కోరారు. వీరితోపాటు సొసైటీ భూములు, లంక భూములు, దేవాలయ భూములు సాగు చేసే వారందరికీ పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పాడి పశువులకు మేత, దాన తక్షణమే అందించాలని, చనిపోయిన పశువులకు వాటి విలువ ఆధారంగా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భారీ వరదల వల్ల గృహాలు అన్ని మునిగి నష్టపోయిన కుటుంబాలకు ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా తక్షణమే ప్రతి కుటుంబానికి రూ. 25వేలు ఆర్థిక సహకారం ఇచ్చి, నిత్యవసర వస్తువులు అన్నిటిని అందించాలని, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరారు.
బుడమేరుకు కనివిని ఎరగని రీతిలో 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి విజయవాడనగరంతో పాటు వందలాది గ్రామాలను ముంచింది. పంట పొలాలను దెబ్బతీసింది. బుడమేరుతో పాటు కృష్ణా నదిలో వచ్చిన వరద కూడా అనేక లంక గ్రామాలను నీట ముంచింది. బుడమేరు నుండి ఎటువంటి ప్రమాదం భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఎసి మిత్ర, కెశ్రీరామకృష్ణయ్య కమిటీలు సూచించిన వరద నిరోధక చర్యలను వెంటనే పూర్తి చేయాలని తద్వారా రైతులకు, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.
ఎగువ ప్రాంతాలలో అవకాశం ఉన్నచోట రిజర్వాయర్లు నిర్మించాలని, దిగు ప్రాంతాలలో బుడమేరు వరద ప్రవాహనికి ఉన్న అవరోధాలను తొలగించాలని, కరకట్లను బలపర్చాలని సూచించారు. విజయవాడనగరం నుండి కొల్లేరు వరకు అక్కడ నుండి ఉప్పటేరు సముద్రంలోకి వెళ్ళేందుకు ఆటంకం ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఈసందర్భంగా నష్టపోయిన పేదవారికి పునరావాసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాయనపాడు నుండి గుంటుపల్లి మధ్యగా బుడమేరుకు మరొక డైవర్స్ ఛానల్ నిర్మించి కృష్ణా నదిలోకి వరద నీటిని మళ్ళించ వచ్చునని నిపుణులు చెబుతున్నారని ఈ అంశాన్ని పరిగణలో తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతు సంఘాల సమావేశం సమితి నాయకత్వ బృందం విన్నవించిన అంశాలన్నిటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రద్ధగా విని ఈ అంశాలన్నిటిని పరిశీలిస్తామని హామీని ఇచ్చారు.
ఈ ప్రతినిధి బృందంలో వై.కేశవరావు, అక్కినేని భవాని ప్రసాద్, డి. హరినాథ్, పి. జమలయ్య, చల్లపల్లి విజయ, మరీదు ప్రసాద్ బాబు, కొల్లా రాజమోహన్, పి వీరాంజనేయులు, గోగినేని ధన శేఖర్, కోగంటి ప్రసాద్‌, కాసాని గణేష్ బాబు, సూర్యప్రసాద్, చెరుకూరి వేణు, మల్లెపు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *