-పల్నాడులో 77 ఏళ్ళ ఎన్నికల్లో కేవలం ఐదుగురు బీసీ ఎమ్మెల్యేలు ఇది దారుణం
-చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో బీసీ కోటా తేలాలంటే ముందుగా కులగణన జరపాలని డిమాండ్
-రిటైర్డ్ డీజీపీ & బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా. పూర్ణచంద్రరావు
నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి ఇప్పటికి ఏపీలో 16 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 2,902 మంది ఎమ్మెల్యేలు అయితే, జనాభా దామాషా ప్రకారం బీసీలు దాదాపు 1,450 మంది అవ్వాలి. కానీ కేవలం 550 మంది మాత్రమే బీసీలు ఎమ్యెల్యేలు అయ్యారంటే, రాజ్యాధికారం విషయంలో బీసీలు ఎంత వెనకబడిపోయారో తెలుస్తోంది. ఇది మారాలంటే, బీసీలు బాగుపడాలంటే, ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలి. అయితే ఇది ఇట్టే సాధ్యపడదు. బీసీల్లో ఏ కులం, ఎవరు, ఎక్కడ, ఎంతమంది ఉన్నారో, ఎవరికి ఎక్కడ ఎన్ని టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తేవాలంటే, అది కేవలం కులగణనతోనే సాధ్యపడుతుంది అని రిటైర్డ్ డీజీపీ & బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా. పూర్ణచంద్రరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.
ఆదివారం నరసరావుపేటలో నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తూ వారు ఈ విధంగా అన్నారు. ‘‘చట్టసభల్లో 34 శాతం, అసెంబ్లీలో 33 శాతం, దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యత, ఇవన్నీ కబుర్లలో, వాగ్దానాల్లో మాత్రమే ఉన్నాయ్. వీటిని పోరాడి సాధించుకోవాలంటే వెంటనే కులగణన జరగాలి. ఇక వేచిచూసేది లేదు, అందుకే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న విజయవాడలో, కులగణన డిమాండ్‌తో మహాధర్నా నిర్వహించబోతోంది. ఈ లోపు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలు చుట్టి బీసీలను ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా చైతన్యపరుస్తామన్నారు. బీసీలు బాగుపడాలంటే, వారి గొంతు చట్టసభల్లో వినపడాలి, దానికి వారి రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి, దానికి కులగణన ఒక్కటే మందు, మార్గం. ఒక పల్నాడు జిల్లా చూసుకుంటే గడచిన 16 ఎన్నికల్లో దాదాపు 110 ఎమ్యెల్యేలు ఎన్నికయ్యారు, అందులో కమ్మ 56, రెడ్లు 32 అయ్యారు, కానీ బీసీలు మాత్రం కేవలం ఐదుగురు మాత్రమే అయ్యారు. అసలు ఎస్సీలు అయితే లేనేలేరు. ఇది ఎంత దారుణం. వీరు ఏ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి వారి గోడు చెప్పుకుంటారు, అభివృద్ధి అడుగుతారు. అందుకే బీఎస్పీ కులగణన డిమాండ్ పై తీవ్రస్థాయిలో పోరాటం సలుపుతోంది.’’ అన్నారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి.పరంజ్యోతి ప్రసంగించి తమ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.