Breaking News

రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రాచరిక దర్పం మాయం….

-స్నేహ,మర్యాదపూర్వక సేవలే లక్ష్యం…
-స్పెషల్ సిఎస్ (రెవెన్యూ) ఆర్పి సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ, మర్యాదపూర్వక వాతావరణం కల్పించడమే తమ ధ్యేయం అని (రెవెన్యూ) స్పెషల్ సిఎస్ ఆర్. పి. సిసోడియా అన్నారు. స్థానిక చుట్టుగుంట సెంటర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా గల గుణదల రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సబ్ రిజిస్టార్ ఆఫీస్ నందు సోమవారం సబ్ రిజిస్టార్ ప్రత్యేక పోడియం తొలగించే కార్యక్రమానికి రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్ పి సిసోడియా ముఖ్యఅతిథిగా హాజరై స్వయంగా పోడియం తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజి ఎంవి. శేషగిరి బాబు, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రిజిస్ట్రేషన్ అధికార్లు పోడియం తొలగింపు కార్యక్రమంలో పాల్గొని పోడియం తొలగించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో రెవెన్యూ స్పెషల్ సి.ఎస్. సిసోడియా మాట్లాడుతూ రిజిస్టార్ కార్యాలయాలలో స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించి మర్యాదపూర్వక సేవలను అందించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాసేవకులే అనే భావన ప్రజలలో కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్టార్ పోడియం చూస్తే ప్రజలకు మనం కోర్టులో ఉన్నామనే భావన కలగకుండా ఉండేందుకే ఇటువంటి మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో రాచరిక పోకడలు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రజల మనోభావాలలో కొంత అభద్రత, భయాందోళన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఉందన్నారు ఉద్యోగులు అధికారులు సమానత్వంతో క్రయవిక్రయదారులకు ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మర్యాదపూర్వకమైన సేవలను పొందగలుగుతున్నామనే భావన కల్పించగలుగుతామని అన్నారు.
ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని కల్పిస్తున్న క్రయవిక్రయదారులను ఎంతో మర్యాదపూర్వకంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రిజిస్ట్రేషన్ సేవలు పొందే క్రయవిక్రయదారులు ద్వారా ఈ ఉద్దేశంతోనే గత రాచరిక పోకడలకు స్వస్తి పలికేందుకు రిజిస్టార్, సబ్ రిజిస్టార్ల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆసనాలు, పోడియంలను తొలగించి ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులకు ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అదే తరహా సౌకర్యాలను రిజిస్టార్ కార్యాలయాలలో కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు పొందేందుకు వచ్చే క్రయవిక్రయదారులు మంచి వాతావరణంలో సేవలను పొందగలుగుతారన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో అత్యంత పారదర్శకతను పాటించేలా అన్ని చర్యలను తీసుకుంటున్నామని రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా వివరించారు.

స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో రాచరిక పోకడలకు స్వస్తి పలికి సాధారణ, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. ఇటువంటి సంస్కరణలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని అధికారులు ప్రజాసేవకులే అన్న భావన కల్పించగలుగుతామన్నారు. నిస్వార్ధమైన సేవలందించి ప్రజల నుండి మన్ననలను పొందేందుకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని గద్దె రామ్మోహన్ కోరారు. కార్యక్రమంలో గుణదల జాయింట్ సబ్ రిజిస్టార్లు కే.ప్రసాదరావు, ఎం. కృష్ణ ప్రసాద్ ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *