Breaking News

నులిపురుగుల నిర్మూలన ద్వారా పిల్లలు ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు

-ఆల్బెండజోల్ తగు మోతాదులో మాత్రలు వాడటం ద్వారా నులిపురుగులను నిరూలించవచ్చును
-జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరం అని, విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమమును జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పండిట్ జవహర్లాల్ నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల నందు జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం (నేషనల్ డీ వార్మింగ్ డే) లో భాగంగా పాఠశాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని భోజనం చేసిన పిల్లలకు చప్పరించే ఆల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలు మింగించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలంటే ఆరోగ్యం కూడా చాలా అవసరము అని అన్నారు. నులిపురుగుల బారిన పడకుండా శారీరక, మానసిక ఆరోగ్యం,రోగ నిరోధక శక్తి పెంపొందాలన్నా పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు. నులిపురుగులు పిల్లల ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయని దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని అంతేకాకుండా రక్తహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపునొప్పి, వికారం విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులను పిల్లలకు దూరం చేసి నులిపురుగులను నిర్మూలించి మంచి ఆరోగ్యంగా ఉండేందుకు అల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి రెండు సార్లు ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. 2 సం.పైన నుండి 19 సంవత్సరాల పిల్లలు, కిశోర బాలలకు 400 ఎం.జి. మాత్రలు, 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర అనగా 200 ఎం.జి ట్యాబ్లెట్ భోజనం చేసిన తరువాత చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పిల్లలు, కిషోర బాలల కడుపులో నులి పురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల చప్పరించే మాత్రలను సంబంధిత విద్యా సంస్థలకు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంబంధిత ఎంపిడిఓ, మునిసిపల్ కమీషనర్లు ఎన్డిడి యాప్ నందు ఎంత మందుల వివరాలు నమోదు చేయాలనీ సూచించారు. జిల్లాలో మొత్తం 4,93,608 మంది విద్యార్థులు ఉండగా అందులో అంగన్వాడీ కేంద్రాల నందు 98405 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నందు 3,15,915 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంటర్ మీడియట్ నందు 74523 మంది, బడిబయట పిల్లలు(10-19సం) 4765 మంది ఉన్నారని అందరికీ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల చప్పరించే మాత్రలను అందేలా చూడాలని డిఎంహెచ్ఓ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించ వచ్చునని పేర్కొన్నారు. 1-2 సం.ల పిల్లలకు సగం మాత్ర 200 mg , 2 సం. పై బడి 19సం.ల పిల్లలకు 400mg ఒక మాత్ర చప్పరిస్తూ మింగించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారులు, మండల పరిధిలో మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏదేని కారణం చేత డీ వార్మింగ్ చేయబడని పిల్లలకు మరలా సెప్టెంబర్ 25 న మాప్ అప్ రోజున ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీహరి, డిఈఓ శేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జయలక్ష్మి, డిప్యూటీ డి.ఎం.& హెచ్.ఓ సుధారాణి, హరిత, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ బీఎస్కే పద్మావతి, డిపిఎంఓ శ్రీనివాస రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి శాంత కుమారి, లావణ్య, డిప్యూటీ డిఈఓ బాలాజీ, హెచ్ఎం మునిశేఖర్, మునిసిపల్ హెల్త్ అధికారి అన్వేష్ రెడ్డి, ఎ.ఎన్.ఎం లు, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *