Breaking News

దేశ అభివృద్ధిలో యువత కీలకం.

-రాబోయే ఐదేళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం
-యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే సత్ ఫలితాలు సాధ్యం
-ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
-కలెక్టర్ పి.ప్రశాంతి

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో మార్పు తీసుకురావాలని తపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో కూడి సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎం. పి. దగ్గుబాటి పురందరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నన్నయ యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యువజన ఉత్సవాలు 2024 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం, తపన యువత లో ఉండాలన్నారు. ప్రపంచ దేశాల్లో 60% పైగా 35 ఏళ్లు లోపున ఉన్న యువ శక్తి మన ఆస్తి అన్నారు. నేడు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాలు వృద్ధాప్య ఛాయలను కలిగి ఉండగా భారతదేశం ఒకటే భవిష్యత్తు అభివృద్ధికి కోలమానంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత శిఖరాల్లో ఉంచేలాగా కృషి చేస్తున్నారు. గతంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం నేడు ఐదవ స్థానానికి చేరుకుందని రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి చేర్చే దిశలో ఆలోచన చేస్తున్నామన్నారు. దేశ జనాభాలో 50% పైగా ఉన్న మహిళల ను ప్రోత్సహించి వారికి సముచిత స్థానం కల్పించాల్సి ఉందన్నారు. మహిళలు రక్తహీనత, అనీమియా ఇతర అనారోగ్య కారణాల వలన బాధపడుతున్నారని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి పథంలో నడపడంలో యువత కీలకమైన బాధ్యతలను స్వీకరించాలన్నారు.

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే విజయాలు సాధ్యం అవుతాయని, సమిష్టిగా పనిచేసి విజయాలను సొంతం చేసుకోవాలి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధానంలో వినియోగించుకోవడం మనపై ఉన్న బాధ్యత అన్నారు. విజ్ఞతతో కూడి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో వాటి ద్వారా ఒనగూరే ప్రయోజనం అందుబాటులోకి తీసుకుని రావడం లో యువత పాత్ర కీలకం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వినూత్నమైన ఆలోచనలకు సృజనాత్మకత జోడించి ఆవిష్కరణ చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో యువత కీలకమైన పాత్రను చేపట్టాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడంలో యువశక్తి కీలకమన్నారు. రాజమండ్రి నగరంలో దామెర్ల రామారావు ఆర్టిగ్యాలరీ, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, నేదునూరి గంగాధర్ గ్రంథాలయం వంటి ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయనీ, వాటి గురించి యువత తెలుసుకుని, మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించటానికి తోడ్పడాల్సీ ఉందన్నారు.

స్టెప్ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ కే. శారద దేవి మాట్లాడుతూ, ఈ ఏడాది యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర దేశ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణల నేపథ్యంలో యువజన దినోత్సవం నిర్వహించడం జరుగు తుందన్నారు. సాంస్కృతి కార్యక్రమాల విభాగంలో వ్యక్తిగత బృందాల కేటగిరిలో ఫ్లోక్ డ్యాన్స్ కేటగిరిలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారని, అక్కడి నుండి జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. గత ఏడాది నాసిక్లో జాతీయస్థాయి పోటీలను నిర్వహించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు కలిగి ఉన్నదని పెద్ద ఎత్తున ఇక్కడ యువత ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

జిల్లాస్థాయి యువజన నాలుగు విభాగాలకు సంబంధించి నేపద్య విభాగం, సాంస్కృతిక విభాగం, జీవన నైపుణ్యం, యువకృతి విభాగాలకు సంబంధించి మొత్తం1369 పాల్గొనడం జరిగింది.

నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కే శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు.

తొలుత జ్యోతి ప్రజ్వాలనతో తూర్పుగోదావరి జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు 2024 ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులను సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్, ఎండి, ఏపీ ఎస్ టి ఈ పి, కే .శారదా దేవి, కాకినాడసీఈవో, సెట్ రాజ్ కె ఎస్ వి. కాశీ విశ్వేశ్వర రావు, రాజనగరం శాసన సభ్యులు, బత్తుల రామకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదికవి నన్నయ్య యూని వర్సిటీ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ వై. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *