Breaking News

ప్ర‌జల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా సేవ‌లందిస్తున్న మంచి ప్ర‌భుత్వం

– సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు సుప‌రిపాల‌న అందిస్తూ సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న మంచి ప్ర‌భుత్వం మీ ముందుంద‌ని.. ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బ‌లోపేతం కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న కోరారు.  ప్ర‌భుత్వం ఏర్ప‌డి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజ‌య‌వాడ రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌లో ఇంటింటిని సంద‌ర్శించి ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి వివ‌రించారు. ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో భాగంగా ప్ర‌భుత్వం అవ్వాతాత‌ల‌కు రూ. 4 వేలు, దివ్యాంగుల‌కు రూ. 6 వేల‌కు పెన్ష‌న్‌ను పెంచి అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న నిరుపేద‌ల‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న‌తో అన్నా క్యాంటీన్ల‌ను పునఃప్రారంభించి, రూ. 5కే భోజ‌నం పెట్టి అమ్మ‌లా ఆదుకుంటున్న ప్ర‌భుత్వ‌మిద‌ని పేర్కొన్నారు. రైతుల క‌ష్టాల్లో భాగంపంచుకొని వారిని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాల‌ని ధాన్యం కొనుగోలులో చెల్లించాల్సిన బ‌కాయిల‌కు సంబంధించి రూ. 1,674 కోట్ల‌ను చెల్లించి ప్ర‌భుత్వం ఆదుకుంద‌న్నారు. సొంత భూమిపై హ‌క్కు పోతుంద‌నే భ‌యాందోళ‌న‌ల‌తో ఉన్న భూ య‌జ‌మానుల ఆలోచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దుచేసి భూహ‌క్కుల‌పై ప్ర‌భుత్వం భ‌రోసా క‌ల్పించింద‌న్నారు. నిరుద్యోగ యువ‌త భ‌విష్య‌త్తుకు బంగారు బాట వేయాల‌నే ల‌క్ష్యంతో మెగా డీఎస్సీ వేసి ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించాల‌న్న సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నది ఈ ప్ర‌భుత్వ‌మేన‌న్నారు. ఇటీవ‌ల అధిక వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల జిల్లా అత‌లాకుత‌లం అయింద‌న్నారు. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రం బుడ‌మేరు ముంపుతో రాత్రికిరాత్రి జ‌ల‌మ‌యమైన సంఘ‌ట‌న‌ను తెలుసుకొని అప్ప‌టిక‌ప్పుడే రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు నారా చంద్ర‌బాబు నాయుడు హుటాహుటిన క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి, బాధితుల‌కు అండ‌గా నిలిచి వారిని అన్ని విధాలా ఆదుకోవాల‌నే లక్ష్యంతో క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్నే స‌చివాల‌యంగా మార్చుకొని రేయింబ‌వ‌ళ్లు నిద్రాహారాలు మాని రాష్ట్రస్థాయి ఉన్న‌తాధికారులు, మంత్రివ‌ర్గాన్ని, శాస‌న‌స‌భ్యుల‌ను, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులంద‌రినీ న‌గ‌రానికి ర‌ప్పించార‌న్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్ర‌జాప్ర‌తినిధి, ఐఏఎస్ అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించి బాధితుల‌కు సంపూర్ణ స‌హాయ‌స‌హ‌కారాలు అందేవ‌ర‌కు విశ్ర‌మించ‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి నేతృత్వంలో తీసుకున్న చ‌ర్య‌లు ఇది మంచి ప్ర‌భుత్వ‌మ‌నేదానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్ర‌జల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్ర‌భుత్వం వినూత్న ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తుంద‌ని.. వాటిని స‌ద్వినియోగం చేసుకొని ఆర్థిక ప‌రిపుష్టిని సాధించాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న స్థానిక ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *