-దుక్కుపాటి శశిభూషణ్, స్థానిక నాయకులు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణ ప్రజలకు వారు నివసించే ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే దిశగా వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోనికి తెస్తున్నట్లు రాష్ట్రస్థాయి వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. బుధవారం స్థానిక స్లాటర్ పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ పురపాలక సంఘం పరిధిలో బాపూజీ నగర్, బేతవోలులో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)కృషితో గుడివాడ పట్టణంలో మరో మూడు వైయస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఆయా ప్రాంతాల్లో వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు కేంద్రాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా నేడు స్లాటర్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో అర్బన్ పీహెచ్ సీకి శంకుస్థాపన చేశామన్నారు. ధనియాల పేట లో కూడా ఆరోగ్య కేంద్రానికి భవనాన్ని నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని త్వరలో నిర్మించనున్నామన్నారు. బాపూజీ నగర్, ఎన్టీఆర్ కాలనీలో ఉన్న అర్బన్ ఆరోగ్య కేంద్రాలు ఆధునీకీకరణకు గాను ఒక్కో హీహెచ్ సీకి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని త్వరలో ఆధునీకీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాగవరప్పాడు పీహెచ్ సీకీ నిధులు మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని త్వరలోనే నాగవరప్పాడు, ఎన్టీఆర్ కాలనీల్లోవైఎస్సారా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు భవన నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందేందుకు మచిలీపట్నం, విజయవాడ ప్రాంతాలకు వైద్యం కొరకు వెళ్లే పరిస్థితి ఉందని, వైద్య సేవలు అర్బన్ పీహెచ్సీ లోనే అందే విధంగా వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లలో పది బెడ్స్ తో అత్యవసర వైద్య సేవలకు అందించేందుకు ఒక వార్డును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. స్లాటర్ పేటలో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రానికి వైద్యులు కూడా నియమించారని, త్వరలో వైద్య సిబ్బందిని కూడా నియమిస్తారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రంగాల్లో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ శేఖర్, డీఈ ప్రవీణ్, స్థానిక నాయకులు పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, అడపా బాబ్జి, అర్బన్ బ్యాంక్ డైరెక్టరు ఆర్. సుబ్రహ్మణ్యం, కడియాల గణేష్, గుమ్మడి నాగేంద్ర,జిల్లా రఘుబాబు, గణపతి, అగస్తరాజు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.