విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మతాలు, దేవుడిని కూడా రాజకీయం చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా.. సత్యనారాయణపురంలోని శ్రీశ్రీశ్రీ దాసాంజనేయస్వామి ఆలయం నందు శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన అపచారాలు, అరిష్టాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేశారని.. ఆయన చేసిన పాపాలు ఈ రాష్ట్రానికి, ప్రజలకు తగలకూడదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలలో పూజలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడలేదని.. అలాంటప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్యాంకర్లను వెనక్కు పంపించామని ఈవో శ్యామలరావు స్పష్టంగా చెప్పినా.. బాబు మాత్రం రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేస్తున్నారని తూర్పారబట్టారు. నెయ్యి శాంపిల్స్ ను సాధారణంగా పరీక్ష కోసం మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)కు పంపిస్తారని.. కానీ తొలిసారి గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్)కి పంపడం వెనుక దాగున్న కుట్ర కోణమేమిటని ప్రశ్నించారు. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ఈ ప్రభుత్వం వద్ద సమాధానం లేదని.. కనుకనే డిక్లరేషన్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భగవద్ రామానుజాచార్యులు చెప్పింది అక్షరసత్యం
తిరునామాలు ధరించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామి వారి కైంకర్యాలు, దర్శనానికి వస్తారో.. వారంతా శ్రీవారి భక్తులేనని భగవద్ శ్రీ రామానుజాచార్యులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. కొండమెట్లు ఎక్కేటప్పుడు గానీ, దర్శనానికి ముందుగానే ఎవరైతే శ్రీవారి తిరునామం ధరించి ఉంటారో వారంతా స్వామివారి విశ్వాసపాత్రులేనని ఆలయ ప్రామాణిక సూత్రాల్లో భగవద్రామానుజుడు స్వయంగా పొందుపరిచారన్నారు. అనుమానాలుంటే తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాలను ఒక్కసారి చదవాలని పచ్చ నేతలకు సూచించారు.
వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ఎందుకంత భయం..?
మాజీ ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకోవడానికి పోలీసుల అనుమతి కావాలా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి తిరుమలకు వెళ్లడం లేదని.. పాదయాత్రకు ముందు కూడా వెళ్లారని గుర్తుచేశారు. సీఎం హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారని చెప్పుకొచ్చారు. ఆయన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించారని చెప్పారు. అయినా ఆంక్షల పేరిట పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు దొంగ స్వాములతో ధర్నాలు చేయించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందని ధ్వజమెత్తారు. అయినా బూట్లతో పూజలు, దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసే చంద్రబాబు మాత్రం పరమ భక్తుడా..? అని నిప్పులు చెరిగారు. చెత్త తరలించే వాహనాలలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లింది మీ హయాంలో కాదా..? సమాధానం చెప్పాలన్నారు. బాబు ప్రచార పిచ్చికి పుష్కరాలలో 30 మంది అమాయకులు చనిపోయారని.. అయినా కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కనుక హిందూ ధర్మం గూర్చి మాట్లాడ నైతిక అర్హత బాబుకి ఏమాత్రం లేదన్నారు.
అమిత్ షా కుటుంబంపై దాడిని మరిచారా..?
బాబు అధికారంలో ఉండగా తిరుపతిలో మే 11, 2018 న అమిత్ షా పై జరిగిన దాడిని బీజేపీ నేతలు మరిచారా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ను వెంబడించి మరీ ఆనాడు తిరుపతిలో టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడింది నిజం కాదా..? బీజేపీ నాయకులు ఒక్కసారి గతం గుర్తుచేసుకోవాలన్నారు. చూస్తుంటే 40 శాతం ఓటు బ్యాంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. కనుకనే వైఎస్ జగన్ ను, గత ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ప్రయత్నంలో.. చివరకు వారే దోషులుగా నిలబడ్డారని ఎద్దేవా చేశారు. హిందూ సమాజం ఈ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించదని.. తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణీమూర్తి, అలంపూర్ విజయలక్ష్మీ, డివిజన్ ఇంచార్జిలు, కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.