రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 08-12-2024న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు అందుబాటులో ఉంచడమైనదని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీని 15-10-2024 వరకు పొడిగించడ మైనదనీ తెలియ చేశారు. ప్రింటెడ్ నామినల్ రోల్ మరియు ఒరిజినల్ SBI కలెక్ట్ రశీదును సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరి తేదీ 17-10-2024 అని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు అని తెలిపారు. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయవలెను. దరఖాస్తు చేసుకొనుటకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు గాని పరీక్ష వ్రాసే సమయమునకు అన్ని ధృవపత్రాలు సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్ధులకు రూ.100/- మరియు యస్.సి. యస్.టి విద్యార్ధులకు రూ.50/- పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని తెలుసు కొనవలసినదిగా కె. వాసుదేవ రావు తెలియ చేయడం జరిగింది.