Breaking News

ఎమ్మెల్సీగా ఆలపాటి విజయం తథ్యం.. జిల్లా నుంచి ల‌క్ష‌ మెజార్టీ ఖాయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-గొల్లపూడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
-ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యంమని, ఎన్టీఆర్ జిల్లా నుంచి ల‌క్ష కు పైగా ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్త కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆధ్వర్యంలో క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ మహాకూటమి ముఖ్యనేతల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ స‌మావేశంలో ఎన్నికల ప్రచారం, పట్టభద్రులకు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివ నాథ్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితర నాయకులు ఘనంగా సత్కరించారు

ఈ స‌మావేశంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తరహాలోనే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని అన్నారు. స్నేహితులు, బంధువులు, సన్నిహితులు అందరికీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చైతన్యపరిచి అందరూ మహాకూటమి బలపరిచిన అభ్యర్థి రాజాకి ఓట్లను వేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ప్రతి కార్యకర్త కంకణ బద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల నాయ‌కుడు అంటూ ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మిత్ర ధ‌ర్మం పాటించి తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ సీటు త్యాగం చేసి, నాదెండ్ల మ‌నోహ‌ర్ గెలుపు కోసం శ్ర‌మించిన‌ ఆయ‌న గొప్ప‌త‌నాన్ని కొనియాడారు. ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా గ్రాడ్యు యేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీచేస్తున్న ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ ను జ‌న‌సేన నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ చేసిన త్యాగం మ‌రిచిపోకుండా భారీ స్థాయిలో ఓట్లు న‌మోదు చేయించి బంప‌ర్ మెజార్టీ తో గెలిపించేందుకు కృషి చేయాల‌న్నారు.

సాధార‌ణంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌లంటే ఆసక్తి వుండ‌దు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వున్న‌ ఓట్లన్నీ న‌మోదు అయితే ఏ పార్టీ ఎప్పుడు ఓడించ‌లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎన్డీయే కూట‌మి అధ్య‌క్షులు నాయకులు అంద‌రూ క‌లిసి క‌ట్టుగా వుండి ప్ర‌జా స‌మ‌స్య‌ల పరిష్కారం కోసం ఏ విధంగా ప‌ని చేస్తున్నామో..అదే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్స్ ఓటు రిజిస్ట్రేష‌న్ కోసం మీరంద‌రూ మ‌రోసారి క‌లిసిక‌ట్టు పని చేసి ఎన్డీయే అభ్య‌ర్థుల‌కి గెలుపు అందించాల‌ని పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ కు
ఎన్టీఆర్ జిల్లా నుంచి భారీ మెజార్టీ ఇచ్చి స‌త్క‌రించుకుందామ‌న్నారు.

మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం లో దాదాపు 65 వేల మంది గ్రాడ్యుయేట్స్ వున్నారు. వీరంద‌ర్ని ఓటు న‌మోదు చేసుకునేలా చూడాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపించ‌టానికి శ్ర‌మిస్తున్న తీరు గ‌మ‌నించి 95 శాతం మంది గ్రాడ్యుయేట్స్ కూట‌మి అభ్య‌ర్దుల‌కే స‌పోర్ట్ గా వున్నారని తెలిపారు. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రాగానే ఫించ‌న్లు నాలుగువేల రూపాయిలు ఇవ్వ‌టంతో పాటు..అన్నా క్యాంటీన్లు ప్రారంభించార‌ని చెప్పారు. అలాగే దీపావ‌ళి నుంచి మ‌హిళ‌ల‌కు ఉచితంగా మూడు సిలిండ‌ర్లు ఇవ్వ‌బోతున్నట్లు ప్ర‌క‌టించారు. ఏడాదిలోపు సూప‌ర్ సిక్స్ లో అన్ని ప‌థ‌కాలు సీఎం చంద్ర‌బాబు అమ‌లు చేస్తార‌ని చెప్పారు.

న‌వంబ‌ర్ ఆరు వ‌రకు అంద‌రూ క‌ష్ట‌ప‌డి ఎక్క‌డ గ్రాడ్యుయేట్స్ వున్నా వారితో ఓట్లు న‌మోదు చేయించి..పోలింగ్ రోజు ఓటు వేయించే విధంగా చూడాల‌న్నారు. ఆల‌పాటి మెజార్టీలో ఎన్టీఆర్ జిల్లా నుంచి మూడొంత‌ల మెజార్టీ వుండాల‌ని ఆ విధంగా అంద‌రూ కృషి చేయాల‌న్నారు.

అంత‌కు ముందు ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను అభివృద్ధి చేయకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంపై పగబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని, ముఖ్యంగా అమరావతి రాజధానిని చేయటాన్ని జీర్ణించుకోలేక జగన్మోహనరెడ్డి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు ప్రతి కార్యకర్త యుద్ధంలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే కృష్ణ గుంటూరు జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన సీఎం చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు గారు నడయాడిన ప్రాంతంలో తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పరిపాలన తీరు మనందరికీ గర్వకారణం అన్నారు. వాళ్ళ నాయకత్వంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా విజయానికి అండగా ఉండాలని కోరారు.

ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం , శాసనమండలి సభ్యులు, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు , మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ల‌తో పాటు త‌దిత‌ర ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *