-రానున్న రోజుల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు చేపడతాం
-గుర్లలో తాగునీరు కలుషితం కావడానికి కారణాలు తెలుసుకుంటున్నాం
-ట్యాంకర్ల ద్వారా గ్రామానికి తాగునీరు అందిస్తున్నాం
-అప్పటివరకు గ్రామంలోని నీటిని తాగకుండా నివారిస్తాం
-మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-గుర్లలో డయేరియా బాధితులకు పరామర్శ
విజయనగరం(గుర్ల), నేటి పత్రిక ప్రజావార్త :
గుర్ల మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం అతిసారం బారినపడిన వారికి అత్యుత్తమ వైద్యసహాయం అందిస్తున్నామని, వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ. వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డయేరియా ప్రబలిన సమాచారం అందిన వెంటనే గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించడంతోపాటు జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి వారికి అందుతున్న వైద్యసహాయంపై పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు. డయేరియా బారినపడిన గుర్ల గ్రామాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం సందర్శించారు. డయేరియా బాధితుల చికిత్సకోసం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణనీటిసరఫరా విభాగాల అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్యసహాయంపై మంత్రికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.భాస్కరరావు వివరించారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మంత్రికి వివరించారు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలపై మంత్రి అధికారులతో చర్చించారు. పలు బోర్ల నుంచి నమూనాలు సేకరించగా కొన్నింటి నుంచి భూగర్భ జలాలు కలుషితం అయినట్టు రిపోర్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై కూడా రిపోర్టులు సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఈ నివేదికలన్నీ సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నీరు కలుషితం కావడానికి కారణాలపై ఒక అంచనాకు రావాలని చెప్పారు. అప్పటివరకు గ్రామస్థులకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రామంలోని బోర్లను గాని, నీటి పథకాలను గాని వినియోగించకుండా నివారించాలని సూచించారు. నీరు కలుషితం కావడానికి కారణాలు తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే గ్రామంలోని తాగునీటి పథకాలు గాని, బోర్లు గాని వినియోగించేలా గ్రామస్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. యీ సందర్భంగా మంత్రి జెడ్పీ హైస్కూలులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో 22 మంది, ఘోష ఆసుపత్రిలో 18 మంది, చీపురుపల్లిలో 7 మంది, విజయనగరం సర్వజన ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతన్నారని, ముగ్గురిని కె.జి.హెచ్.కు తరలించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.భాస్కరరావు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత ఐదు రోజులుగా ఇక్కడ పరిస్థితులపై అధికారులతో మాట్లాడి తెలుసుకుంటున్నామని చెప్పారు. గ్రామంలోని పలు రకాల నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నామని, త్వరలోనే కారణాలపై ఒక నిర్ధారణకు వస్తామన్నారు. గ్రామంలోని వ్యర్ధాలను చంపావతి నదిలోకి విడిచిపెట్టడం కూడా నీరు కలుషితం కావడానికి ఒక కారణంగా గుర్తించామన్నారు. భవిష్యత్తులో వ్యర్ధాలను నదిలోకి విడిచిపెట్టకుండా చర్యలు చేపడతామన్నారు. పైనున్న గ్రామాలు వ్యర్ధాలు నదిలోకి విడిచిపెట్టకుండా ఒక నివేదిక అందించాలని డి.పి.ఓ.ను ఆదేశించామన్నారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని, ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఈరోజు సాయంత్రం కల్లా తాగునీటి పరీక్షలకు సంబంధించిన నివేదికలు వస్తాయని చెప్పారు. భూగర్భ జలాలు కలుషితం అయినట్లు నిర్ధారణ జరిగితే దానిని నివారించే చర్యలు చేపడతామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ డైరక్టర్ పద్మావతి కూడా పర్యటనలో పాల్గొన్నారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట చీపురుపల్లి ఆర్.డి.ఓ. సత్యవాణి, డి.ఎం.హెచ్.ఓ. డా.భాస్కరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.