-పోస్టర్లు, కరపత్రాల్ని ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుక్క, పాము కాటులకు గురైన వారికి సత్వర చికిత్స అందించే చర్యల్లో భాగంగా సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హెల్ఫ్ లైన్ ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 15400 టోల్ ఫ్రీ నంబరుకు బాధితులు సంప్రదిస్తే కుక్క కాటుకు వ్యాక్సిన్లు ఎక్కడ లభ్యమవుతాయో వెంటనే సమాధానం చెప్తారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఆంగ్లం, హిందీ భాషల్లో సమాధానం చెప్తారు. సోమవారం నుండి తెలుగులోనూ సమాధానం ఇస్తారు. పాము, కుక్క కాట్ల మరణాల్ని
తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ హెల్ఫ్ లైన్ ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి
అనుసంధాదనంగా విజయవాడలోనూ ఏర్పాటు చేశారు. 2030 నాటికి కుక్క కాటువల్ల వచ్చే ర్యాబిస్ వ్యాధిని
నిర్మూలించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఉపయోగపడుతుంది.
ర్యాబిస్ వ్యాధితో ఏడాదికి 20 వేల మంది వరకు మరణిస్తున్నారు. రాష్ట్రంలో 2023లో 2,12,246 మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రజల్లో ఆవగాహన కల్పించేందుకు తెలుగులో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాల్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఆవిష్కరించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎ.సిరి, ఎన్‌హెచ్ ఎం సిఎఓ గణపతిరావు, ఒన్ హెల్త్ నోడలాఫీసర్ డాక్టర్ మోహన్ కృష్ణ, ఐఎస్‌డిపి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి, యుఎన్‌డిపి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సిడిసి), యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ఫండ్(యుఎన్‌డిపి)తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ కాల్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్, ఢిల్లీ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రారంభంచింది. సమీప ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటు, పాము కాటుకు వ్యాక్సిన్ల లభ్యతతో పాటు ముందస్తు జాగ్రత్త చర్యలు, సమాచారం, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కాల్ సెంటర్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.