-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని, నిర్మాణ పనులు నిర్దేశిత గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై జెసి శుభం బన్సల్ తో కలిసి ఎన్హెచ్ఎఐ పిడి లు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీఓ లు తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి రామ్మోహన్, కిరణ్మయి, భాను ప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తాసిల్దార్లు, విఆర్ఓ లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న కడప – రేణిగుంట, రేణిగుంట – నాయుడుపేట 6 లేన్ వంటి రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ (కాలూరు క్రాస్ నుండి రేణిగుంట వరకు) 6 లేన్ల రహదారి వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని భూ సేకరణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో నాయుడుపేట – తూర్పు కనుపూరు 6 లేన్ల రహదారి 35 కి.మీ, చిల్లకూరు క్రాస్ నుండి తూర్పు కాన్పూర్ వరకు 4 లేన్ల రహదారి మరియు తూర్పు కాన్పూర్ నుండి కృష్ణపట్నం పోర్ట్ సౌత్ గేట్ 6 లేన్ల రహదారి 36 కి.మీ, తమ్మినపట్నం నుంచి నారికెళ్లపల్లెను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 4 లేన్లు, పోర్ట్ రోడ్డు పొడిగింపు 6 లేన్ల రహదారి 16 కి.మీ అభివృద్ది పనులు కూడా టైం లైన్ మేరకు పూర్తి చేయాలనీ సూచించారు. పారిశ్రామిక రంగానికి జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా మరింత సౌకర్యం కలగనున్నదనీ తెలిపారు. భూసేకరణ పెండింగ్ అవార్డులు త్వరిత గతిన నిబంధనల మేరకు చేపట్టేలా ఉండాలని తెలిపారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్ హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
చెన్నై జాతీయ రహదారి 205 కి సంబంధించిన విస్తరణ కొత్త ప్రతిపాదనలకు చెందిన భూసేకరణ చేపట్టాలని, అలాగే రైల్వే ప్రాజెక్టులు శ్రీకాళహస్తి నడికుడి ప్రాజెక్ట్ కు సంబంధించిన భూ సేకరణలో ఇబ్బందులు లేకుండా ఆర్డీఓ లు, తాశిల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్ కు సంబంధించిన భూ సేకరణ పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్, ఐఐటీ, ఐజర్, ఐఐఐటీ శ్రీసిటీ కి సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు.
ఎన్హెచ్ఎఐ అధికారులు వివరిస్తూ ఎయిర్పోర్ట్ వద్ద పెండింగ్ పనులు నవంబర్ 10 నాటికి, రేణిగుంట నాయుడుపేట వరకు రోడ్ నవంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పీలేరు కాలూరు రహదారి నిర్మాణం 15జనవరి2025 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జెసి గారు భూసేకరణ పెండింగ్ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో పిడి ఎన్హెచ్ఎఐ లు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎం.కే. చౌదరి, చెన్నై రవీంద్ర రావు, జిల్లా సర్వేయర్ అరుణ్, తాసిల్దార్లు, సర్వేయర్లు, విఆర్ఓ లు, కలెక్టరేట్ విభాగం, డిటి భాస్కర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.